Kerala Cabinet: ఈనెల 20న కొలువుదీరనున్న కేరళ కొత్త కేబినెట్.. ఆరోగ్య మంత్రి శైలజకు దక్కని చోటు
కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనుంది.
Kerala Cabinet Finalised: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేరళలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అనూహ్య విజయం సాధించింది. ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి పగ్గాలు చేపట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రెండవసారి పట్టం కట్టారు ప్రజలు. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార ఎల్‌డీఎఫ్ 99 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 41 స్థానాలకు పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ కనీసం బోణీ కొట్టలేకపోయింది. ఉన్న ఒక్కస్థానాన్నీ సైతం కోల్పోయింది.
ముఖ్యమంత్రిగా రెండవసారి బాథ్యతలు చేపట్టనున్న పినరయి విజయన్.. 21 మందితో కేబినెట్ ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్ తెలిపారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఎటువంటి హంగు ఆర్భాటాల్లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అన్నివర్గాల ప్రజలు తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఓట్లేసినందున..కేబినెట్‌లో సైతం అన్నివర్గాలవారికి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ఎల్డీఎఫ్ కేబినెట్‌లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్, ఎన్సీపీ తరపున ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.
గతంలో నిఫా వైరస్ సమయంలోనూ,కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన కెకె శైలజకు ఈసారి కేబినెట్‌లో బెర్త్ లేదని తెలుస్తోంది. భవిష్యత్ ముఖ్యమంత్రిగా కేరళ ప్రజలు ఆమెను కీర్తిస్తున్న వేళ ఈ అనూహ్య నిర్ణయం అందరినీ విస్మయపరుస్తోంది. అయితే శైలజ ఒక్కరే కాదు, గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లెవరికీ కొత్త కేబినెట్‌లో చోటు లేదని తెలుస్తోంది.
శాసనసభ స్పీకర్‌గా ఎం.బి.రాజేశ్, మంత్రులుగా ఎం.వి.గోవిందన్, కె.రాధాకృష్ణన్, కె.ఎన్.బాలగోపాల్, పి.రాజీవ్, వి.ఎన్.వాసన్, సౌజీ చెరియన్, శివన్‌కుట్టి, మహ్మద్ రియాజ్, డాక్టర్ ఆర్.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్ రెహ్మాన్ లకు చోటు దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. కాగా, నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ విజయన్ నేత్రుత్వంలోని ఎల్‌డీఎఫ్ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 50వేల సీట్ల సామర్థ్యం ఉన్న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.