Pegasus case – SC: పదే పదే ఇదే ప్రస్తావనా..? అఫిడవిట్ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాం.. పెగాసస్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పెగాసస్‌పై స్వతంత్ర దర్యప్తు జరపాలన్న పిటిషన్లపై.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
స్పైవేర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. మరో అఫిడవిట్ దాఖలు చేయలేమని కోర్టుకు విన్నవించారు ఎస్జీ. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే కేంద్రం అభిప్రాయమని, ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని విజ్ఞప్తి చేశారు. ఐతే దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపింది. కేంద్రం పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించటాన్ని తప్పుబట్టింది.
ప్రస్తుతం పెగసస్ అంశాన్ని అందరూ ఆసక్తిగా చూస్తారని.. కాబట్టి పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో కేంద్రం స్పష్టం చేస్తే చాలని పేర్కొన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. మరోవైపు కేంద్రం వాదనలను పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. వాస్తవాలు చెప్పబోమని ప్రభుత్వం అంటోందని ఆయన ఆరోపించారు. సాధారణ ప్రజలే లక్ష్యంగా చట్టవిరుద్ధంగా పెగసస్ వాడారని, పౌరులపై స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని వాదించారు.
స్పేవేర్ ఉపయోగించటానికి ఓ విధానం ఉండాలన్న కపిల్ సిబల్.. అది లేక పోగా మేం చేయల్సింది చేస్తామన్న విధంగా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. ఐతే ఇరు పక్షాల వాదనలూ విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రెండు, మూడ్రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయనందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని.. కేంద్రానికి పునరాలోచన ఉంటే చెప్పాలని సుప్రీం పేర్కొంది.