Mehbooba Mufti issued Summons : జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.
ఈడీ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులో ప్రశ్నించేందుకు మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేశారు. మార్చి 15న న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆమెను కోరారు. జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మెహబూబా ముఫ్తీ దాదాపు ఓ సంవత్సరంపాటు నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు.
GOIs tactics to intimidate & browbeat political opponents to make them toe their line has become tediously predictable.They don’t want us to raise questions about its punitive actions & policies. Such short sighted scheming wont work .
— Mehbooba Mufti (@MehboobaMufti) March 5, 2021
ఇదిలావుంటే, జమ్ముకశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జమ్ముకశ్మీర్ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు, జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి,ఎన్‌సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది. జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది.