Tamil Nadu: అతడి లగేజ్ బ్యాగ్ చూడగానే డౌట్ పడ్డ అధికారులు.. వెంటనే తనిఖీ చేయగా
ఈ మధ్య విమానశ్రయాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటివి తరలించడం విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ఇండియాను తీసుకురావడం, ఆ తర్వాత పోలీసులకు పట్టుబడటం లాంటివి దేశంలోని ఉన్న చాలా విమానశ్రయాల్లో చోటుచేసుకుంటున్నాయి.

ఈ మధ్య విమానశ్రయాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటివి తరలించడం విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ఇండియాను తీసుకురావడం, ఆ తర్వాత పోలీసులకు పట్టుబడటం లాంటివి దేశంలోని ఉన్న చాలా విమానశ్రయాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఎంతమందిని అరెస్టు చేసిన కూడా ఇంకా అలాంటి అక్రమ రవాణాలు చేయడం మాత్రం ఆగడం లేదు. అలాగే బంగారాన్ని కూడా అక్రమ రవాణా చేస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అధికారుల కంట పడకుండా నిందితులు ఎక్కడెక్కడో బంగారం పేస్టులను దాచి విదేశాల నుంచి ఇండియన్ ఎయిర్‌పోర్టులకు వస్తుంటారు. అయినప్పటికీ చాలామంది నిందితులను అధికారులు చాకచక్యంగా పట్టుకుంటారు. మరో విషయం ఏంటంటే ఈ మధ్యన పాములు కూడా అక్రమంగా తరలిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ ప్రయాణికుడు తనతో పాటు 47 కొండచిలువలను తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి అనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి భారత్‌కు వచ్చాడు. అయితే అతడు తనతో పాటు ఏకంగా 47 కొండ చిలువలను తీసుకొచ్చాడు. అంతేకాదు రెండు బల్లులను కూడా తీసుకొచ్చాడు. అతను ప్రయాణిస్తున్న విమానం తమిళనాడులో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు అతని బ్యాగ్‌లను చూసి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అతని వద్ద ఉన్న లగేజీలను తనిఖీ చేశారు. దీంతో అధికారులు అతని బ్యాగ్‌లో 47 కొండ చిలువలను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందులో వివిధ రకాల జాతులకు చెందిన కొండ చిలువలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ నిందితుడు ఈ కొండచిలువలను రంధ్రాలు ఉన్నటువంటి పెట్టెల్లో వాటిని తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారుల సమాచారం మేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే అక్కడికి ఫారెస్టు అధికారులు కూడా చేరుకున్నారు. అక్రమంగా తీసుకొచ్చిన ఆ 47 కొండచిలువలను తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేయనున్నారు. ఈ విషయన్ని అక్కడి అధికారులు తెలియజేశారు.