బీజేపీకి తాము దూరమైనా.. హిందుత్వను వీడలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతీయ జనతా పార్టీ హిందుత్వ కాదని, అది మరో అంశమని అన్నారు. ఏమైనా.. హిందూత్వకు మాత్రం తాము దూరం కాలేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమ ప్రభుత్వం కోటి రూపాయల విరాళం ఇస్తుందని ఆయన ప్రకటించారు. గత ఏడాది డిసెంబరులో సీఎం అయ్యాక మొదటిసారిగా అయోధ్యను సందర్శించారు ఉధ్ధవ్.. గతంలో చివరిసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు.. రామాలయ నిర్మాణంపై అయోమయ పరిస్థితి నెలకొని ఉందని ఆయన గుర్తు చేశారు. 2018 నవంబరులో ఈ ప్రాంతాన్నివిజిట్ చేశానని, అయితే గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించిందని, తాను దాదాపు అదే సమయంలో ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన చెప్పారు. ‘మూడో సారి ఇక్కడికి వచ్చాను. అయోధ్యను నేను ఎప్పుడు సందర్శించినా ఇక్కడ నాకు శుభ సమాచారం లభిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక్కడ గుడి నిర్మాణంపై నేను యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ తో మాట్లాడాను. ఆలయ నిర్మాణం జరగడం తథ్యమని అన్నాను. అయితే ఈ గుడి నిర్మాణానికి తోడ్పడే భక్తులకోసం ఏదైనా కొంత స్థలాన్ని కేటాయించాలని కోరాను’ అని ఉధ్ధవ్ థాక్రే తెలిపారు. కాగా-అయోధ్యలో జరిగే హారతి కార్యక్రమంలో ఉధ్ధవ్ కూడా పాల్గొనవలసి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా దాన్ని రద్దు చేసుకున్నారు.