Uttarakhand flash floods : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో మంచుకొండ విరిగిపడి జోషిమఠ్‌లో ధౌలి గంగా నదికి ఆకస్మాత్తుగా వరదలు రావడంతో సుమారు 125 గల్లంతు అయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దప్రతిపాదికన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది. ఏకంగా భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనిపై ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ, మంచుకొండ విరుచుకుపడడానికి కారణం ఏమిటనేది నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తాము ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటంపైనే ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుపు వరదల్లో గొర్రెల కాపరులతో సహా 125 మంది గల్లంతయ్యారన్నారు. వారి జాడ కోసం సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.
ఈ విపత్తులో మరణించిన వారికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రావత్ ప్రకటించారు. మరోవైపు, ఎన్‌డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఘటనా స్థలికి చేరుకుందని సీఎం చెప్పారు. వైద్యుల బృందం కూడా ఘటనా స్థలంలోనే ఉందని తెలిపారు. 60 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అవసరమైన సహాయక సామగ్రితో సహా ఘటనా స్థలికి చేరిందని త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.