ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ పేరొందిన స్కూలు అనధికారికంగా మూతబడింది. శ్రీరామ్ మిలీనియం స్కూల్ అనే ఈ బడికి తమ విద్యార్థులను పంపరాదని తలిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్ధి తండ్రికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడంతో.. ఇతర స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా ఎందుకైనా మంచిదని తమపిల్లలను ఆ బడికి పంపరాదని తీర్మానించుకున్నారు. దీంతో ఈ బడి దాదాపు మూతబడింది. ఇటలీ వెళ్లి వఛ్చిన ఈ విద్యార్థి తండ్రికి కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు తేలడంతో ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. అయితే ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఈ మధ్యే ఈయన కొడుకు బర్త్ డే పార్టీ జరగగా,,నోయిడాలోని, ఢిల్లీలోనూ ఉన్న ఇతని ఫ్రెండ్స్ అంతా దీనికి హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఆ పిల్లలందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. పైగా 14 రోజులపాటు వారిని వైద్య సంబంధ నిఘాలో ఉండాలని కూడా వారు సూచించారు. ఈ స్కూలు విద్యార్థులకు త్వరలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.