సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా.. మరిన్ని రాష్ట్రాల్లో పెనాల్టీల విషయంలో స్వల్ప మార్పులు తెచ్చాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్తున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చాక.. చిత్ర విచిత్రమైన ఘటనలు చూడాల్సి వస్తుంది. కొందరి వాహనదారులకు చలాన్ల రూపంలో మోత మోగుతుంటే.. మరికొందరికి వింత పెనాల్టీలను చూడాల్సి వస్తుంది. అయితే ఢిల్లీలో అలాంటి విత పెనాల్టీ ఘటన ఒకటి దేశ రాజధానిలో వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదంటూ.. పోలీసులు రూ.500 పెనాల్టీ వేశారు. ఈ నెల 11న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఈ చలానా రాసినట్లు బాధితుడు పేర్కొన్నారు.
విషయానికి వస్తే.. నోయిడాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీ.. బస్సులను అద్దెకు ఇస్తూ ఉంటుంది. దాదాపు ఆ ట్రావెల్స్ సంస్థకు 80 బస్సులు ఉన్నాయి. అయితే ఆ బస్సులు రోజు బయట తిరిగేవి కావడంతో.. ఆ బస్సు డ్రైవర్లు ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచారా అన్న విషయం తెలుసుకునేందుకు ఓ ఉద్యోగుడిని నియమించుకున్నారు. అయితే ఆ ఉద్యోగి అన్ని బస్సుల వివరాలు చెక్ చేస్తుండగా.. ఓ బస్సుకు పోలీసులు విధించిన జరిమానా చూసి షాక్ తిన్నారు. బస్సు వివరాలు చెక్ చేస్తుండగా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో రూ.500 పెనాల్టీ విధించినట్లు ఆ చలానా ఉంది. అయితే వాహన నంబర్ మాత్రం బస్సుదే ఉండటం చూసి అవాక్కయ్యారు ఆ సంస్థ ఉద్యోగులు. అయితే ఇలాంటి విచిత్ర చలాన్లు గతంలో కూడా ఎదురయ్యాయని ఆ ట్రావెల్స్ యాజమాన్యం తెలిపింది. మూడు నెలల క్రితం ఒకే రోజు ఒకే బస్సుకు మూడు చలాన్లు విధించారని.. అయితే పెనాల్టీలు వేశారు కానీ.. అసలు ఆ పెనాల్టీలు దేనికోసం అన్నది ఆ చలాన్లో తెల్పలేదన్నారు. అయితే, ఆన్‌లైన్లో నమోదు చేయడంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. త్వరలో సరిచేసిన జరిమానా యజమానికి పంపుతామని తెలిపారు. అయితే బస్సు నంబరుతోనే మరేదైనా ద్విచక్ర వాహనం అక్కడ తిరుగుతుందా లేక.. పొరబాటున వాహనం నంబర్ తప్పుగా ఎంటర్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నూతన వాహన చట్టం అమలులోకి వచ్చాక.. దేశ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు చలాన్ల మోత తప్పడంలేదు.