ఏ పదవి శాశ్వతం కాదు.. త్వరలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటా..: డీకే శివకుమార్‌

కర్నాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పీసీసీ చీఫ్‌ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను శాశ్వతంగా ఉండడం అసాధ్యమన్నారు. త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. సీఎం సిద్దరామయ్య వర్గీయులు పీసీసీ పదవి కోసం డిమాండ్‌ చేస్తున్న వేళ డీకే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఏ పదవి శాశ్వతం కాదు.. త్వరలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటా..: డీకే శివకుమార్‌
Dk Shivakumar

Updated on: Nov 20, 2025 | 7:28 AM

కర్నాటక రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. త్వరలో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రకటించారు . పీసీసీ పదవి కోసం సిద్దరామయ్య వర్గీయులు డిమాండ్‌ చేస్తున్న వేళ డీకే ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుది. త్వరలో సిద్దరామయ్య స్థానంలో డీకే సీఎం పగ్గాలు చేపడుతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

కర్నాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పీసీసీ చీఫ్‌ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను శాశ్వతంగా ఉండడం అసాధ్యమన్నారు. త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. సీఎం సిద్దరామయ్య వర్గీయులు పీసీసీ పదవి కోసం డిమాండ్‌ చేస్తున్న వేళ డీకే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ పదవి నుంచి తప్పుకున్నప్పటికి పార్టీని ముందుండి నడిపిస్తానని అనుచరులకు , అభిమానులకు డీకే శివకుమార్‌ భరోసా ఇచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవి శాశ్వతం కాదని , కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా 100 కాంగ్రెస్‌ కార్యాలయాలను నిర్మిస్తానని ప్రకటించారు. అయితే డీకే స్టేట్‌మెంట్‌ను ఆయన అభిమానులు వ్యతిరేకించారు. ఇప్పటికే తాను ఐదున్నర ఏళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఆరేళ్లు పూర్తవుతాయన్నారు డీకే శివకుమార్‌. ఇతరులకు అవకాశం దక్కాలని కూడా ఆయన చెప్పారు. మార్చి 2020 నుంచి పీసీసీ అధ్యక్ష పదవిలో డీకే శివకుమార్‌ ఉన్నారు.

‘‘పీసీసీ అధ్యక్ష పదవి శాశ్వతం కాదు.. కాని నేను 100 కాంగ్రెస్‌ కార్యాలయాలను నిర్మించడం మాత్రం ఖాయం. పదవి శాశ్వతం కాదు.. ఇప్పటికే ఐదేళ్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆరేళ్లు పూర్తవుతాయి. వేరేవాళ్లకు కూడా అవకాశం దక్కాలి. కాని పార్టీని ముందుండి నడిపిస్తా.. ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడే పీసీసీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పా.. ఖర్గే, రాహుల్‌ ఒత్తిడితో పదవిలో కొనసాగుతున్నా.. నా బాధ్యతలు నెరవేర్చా..’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు డీకే.

వాస్తవానికి 2023లో డిప్యూటీ సీఎం పదవి చేపట్టినప్పుడే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డీకే శివకుమార్‌ భావించారు. అయితే మల్లిఖార్జున్‌ ఖర్గే , రాహుల్‌గాంధీ జోక్యంతో పదవిలో కొనసాగుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకే డీకేను పీసీసీ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తామని చెప్పారని , కాని ఇప్పటికి కూడా ఆయనే పదవిలో ఉన్నారని సిద్దరామయ్య వర్గీయులు చెబుతున్నారు. తమ వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి సతీష్‌ జర్కిహోలి లేదా .. ఈశ్వర్‌ కాంద్రేకు పీసీసీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

డీకే శివకుమార్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. త్వరలో కర్నాటక కేబినెట్‌ విస్తరణ జరుగుతుంది. సీఎం మార్పుపై ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సిద్దరామయ్య స్థానంలో డీకే సీఎం పగ్గాలు చేపడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నవంబర్‌ లోనే సీఎంగా డీకే ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే సిద్దరామయ్య వర్గీయులు మాత్రం ఆయనే ఐదేళ్లు సీఎంగా ఉంటారని చెబుతున్నారు. ఇదిలావుంటే, సిద్దరామయ్య , డీకే శివకుమార్‌ కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వచ్చారు. హైకమాండ్‌తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలని సిద్దరామయ్యకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నచ్చచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..