
నీట్-యూజీ (NEET-UG) పరీక్షకు వారం రోజుల ముందు ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని శ్రిష్టి దుబేకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య, పరీక్షా సదుపాయాలు కల్పించింది. విద్యార్థిని పరిస్థితిని తెలుసుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా స్పందించి, ఆమె పరీక్ష రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రిష్టి దుబేకు తొమ్మిది పక్కటెముకలు విరగడంతో పాటు ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు అత్యవసర రక్తనాళాల శస్త్రచికిత్స నిర్వహించగా, కొంతకాలం వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, వైద్య విద్యే తన లక్ష్యమని భావించిన ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్ పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో శ్రిష్టి తల్లిదండ్రులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాసి తమ కుమార్తె పరిస్థితిని వివరించారు. ఆమెకు వైద్య పరికరాలు, ఛెస్ట్ డ్రెయిన్ అమర్చిన పరిస్థితిలోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని, ఆసుపత్రి వైద్య బృందం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొంటూ ప్రత్యేక అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా శ్రిష్టి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పరీక్షకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ), స్థానిక పరిపాలన, పరీక్షా కేంద్రం అధికారులను ఆదేశించారు. విద్యార్థిని తన భవిష్యత్తు కోసం పరీక్ష రాయగలిగేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కుటుంబానికి హామీ ఇచ్చారు.
మంత్రి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రంలో శ్రిష్టి కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కుర్చీ, టేబుల్‌తో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆసుపత్రి దుస్తులతోనే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ఛెస్ట్ డ్రెయిన్ వంటి వైద్య పరికరాలతో పరీక్ష రాసేందుకు అనుమతించడంతో పాటు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరీక్షా కేంద్రం వద్ద అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. ఎన్‌టీఏ, స్థానిక పరిపాలన, పరీక్షా కేంద్రం అధికారులు, ఐఎల్‌ఎస్ ఆసుపత్రి వైద్య బృందం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. పరీక్ష మొత్తం సమయంలో వైద్య బృందం విద్యార్థిని ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించింది.
ఈ సందర్భంగా శ్రిష్టి తల్లిదండ్రులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చూపిన మానవీయ స్పందనను ప్రత్యేకంగా అభినందించారు. తమ కుమార్తె పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకున్న మంత్రి, అలాగే ఎన్‌టీఏ, పరీక్షా కేంద్రం అధికారులు, స్థానిక పరిపాలన అందించిన సహకారం వల్లే ఆమె తన కలల వైపు మరో కీలక అడుగు వేయగలిగిందని పేర్కొంటూ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
VIDEO | Union Education Minister Dharmendra Pradhan (@dpradhanbjp) speaks with the parents of NEET aspirant Shrishti Dubey, who was critically injured in a road accident days before the exam, and assures support to help her appear for the NEET UG re-examination.
Shrishti,… pic.twitter.com/ejrIGuyZtk
— Press Trust of India (@PTI_News) June 21, 2026
కాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నీట్-యూజీ పరీక్షకు ముందు బుర్ఖా ధరించిన అభ్యర్థిని కుల్సుమ్ బానోకు పరీక్షా కేంద్రంలో ప్రవేశం విషయంలో కొద్దిసేపు వివాదం నెలకొంది. బుర్ఖా, దుపట్టా తొలగించాలని అధికారులు కోరారని ఆమె ఆరోపించింది. అయితే ఎన్‌టీఏ అనుమతించిన దుస్తులతో వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదని, అవసరమైతే పరీక్ష రాయకపోయినా తన గుర్తింపును వదులుకోనని ఆమె పేర్కొంది. అనంతరం ఉన్నతాధికారులు నిబంధనలపై స్పష్టత ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని, ఎలాంటి వివాదాలు లేకుండా విద్యార్థులందరినీ పరీక్షకు అనుమతించినట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Ajmer, Rajasthan: CO North Shivam Joshi says, "Students were admitted strictly according to the scheduled time, and the entry gates are now closed. The issue regarding the Burqa has also been resolved. There was some lack of clarity regarding certain rules, which was… https://t.co/EwI7dPCeSm pic.twitter.com/ATkSdNQHH0
— ANI (@ANI) June 21, 2026