పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చింది ఆ ఇద్దరే!

యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక పురోగతి సాధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. బట్‌కోట్‌కు చెందిన పర్వేజ్‌ అహ్మద్‌ జోథర్‌, పహల్గామ్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌ జోథర్‌లను అరెస్టు చేసినట్లు ఎన్​ఐఏ ప్రకటించింది. వారిద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించారని, ప్రయాణానికి కూడా సహాయం చేసినట్లు గుర్తించారు.

పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చింది ఆ ఇద్దరే!
Pahalgam

Updated on: Jun 22, 2025 | 5:08 PM

యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక పురోగతి సాధించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇద్దరు స్థానికులను అరెస్టు చేసింది. బట్‌కోట్‌కు చెందిన పర్వేజ్‌ అహ్మద్‌ జోథర్‌, పహల్గామ్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌ జోథర్‌లను అరెస్టు చేసినట్లు ఎన్​ఐఏ ప్రకటించింది. వారిద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించారని, ప్రయాణానికి కూడా సహాయం చేసినట్లు గుర్తించారు.

పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. మే 7న, భారతదేశం ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది, పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య మూడు రోజుల సైనిక ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చినట్లు నిందితులు అంగీకరించారు. అటాక్ చేసిన ముగ్గురు టెర్రరిస్టుల పేర్లను కూడా అధికారులకు తెలిపారు. ఇద్దరు కలిసి ముగ్గురు టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వటమే కాకుండా దాడికి రోడ్ మ్యాప్ వేసి ఇచ్చినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. దాడి చేసిన వారికి లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్ధారించింది. 1967 నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేసిన NIA కేసును మరింత దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మరిన్ని దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ దారుణ మారణకాండలో పాల్గొన్న ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత దేశంలో అనేక చోట్ల పాకిస్థాన్‌కు ఏజెంట్లుగా పనిచేసిన చాలా మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మన భారతదేశంలో ఉంటూ పాక్‌ కోసం పనిచేసిన ప్రముఖ యూట్యూబర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దాడికి కారకులైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి అమానుష చర్యలకు సహకరించిన ఈ ఇద్దరిని విచారిస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎన్‌ఐఏ అంచనా వేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..