Bihar Cabinet: బీహార్ మంత్రివర్గం ఏర్పాటుపై వీడిన ఉత్కంఠ.. తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు దక్కిన చోటు..

|

Aug 16, 2022 | 1:01 PM

బీహార్ లో మంత్రివర్గం ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు కేబినేట్ లో చోటు ఉంటుందా.. ఉండదా అనే చర్చకు తెరదించుతూ..

Bihar Cabinet: బీహార్ మంత్రివర్గం ఏర్పాటుపై వీడిన ఉత్కంఠ.. తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు దక్కిన చోటు..
Tej Pratap Yadav
Follow us on

Bihar Cabinet: బీహార్ లో మంత్రివర్గం ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు కేబినేట్ లో చోటు ఉంటుందా.. ఉండదా అనే చర్చకు తెరదించుతూ.. నితీష్ మంత్రివర్గంలో బెర్తు ఖరారు చేయడంతో.. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహఘట్ బంధన్ కూటమి ప్రభుత్వంలో 30 మంది కొత్త మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 10వ తేదీన సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయగా.. మరో 30 మంది మంగళవారం ప్రమాణం చేశారు. గతంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో కుటుంబ పాలన, అవినీతికి సంబంధించిన అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈసారి కేబినేట్ లో చోటు దక్కుతుందా లేదా అనే చర్చ సాగింది. చివరికి తేజ్ ప్రతాప్ యావద్ కు అవకాశం దక్కింది.

ఈఉదయం పాట్నాలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాగు చౌహన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. దీంతో సీఎంతో కలిపి మంత్రివర్గం సంఖ్య 32కు చేరింది. మంత్రుల్లో ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందూస్థానీ అవామ్ మోర్చ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీహార్ లో శాసనసభ్యుల సంఖ్య 243 కావడంతో మంత్రి వర్గంలో గరిష్టంగా 36 మంది ఉండొచ్చు. అయితే ప్రస్తుతం సీఎం నితీష్ తో కలిపి 32 మందికి మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. అయితే మరో నలుగురికి మంత్రివర్గంలో చోటు ఖరారైందని.. మరోసారి మంత్రివర్గ విస్తరణలో వీరు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీహార్ లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన జేడీయూ నేత నితీష్ కుమార్.. ఈనెల 10వ తేదీన ఆర్జేడీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. బీహార్ లో మహాఘట్ బంధన్ బలం 163 మంది శాసనసభ్యులు కాగా.. వీరికి ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు పలకడంతో బలం 164కు పెరిగింది. సీఎం నితీష్ కుమార్ ఈనెల 24వ తేదీన సభలో విశ్వాసపరీక్షను ఎదుర్కొవల్సి ఉంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం నితీష్ కుమార్ విశ్వాసపరీక్షలో గట్టెక్కనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..