ఒకప్పుడు తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్.. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. తెలుగుపై ఉన్న మమకారంతో ఏకంగా పార్లమెంట్ సాక్షిగా తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ‘శ్రీను వాసంతి లక్షి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవనీత్.. సరైన హిట్స్ రాకపోవడంతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రాందేవ్ బాబా యోగా క్యాంప్‌లో చేరారు. ఇక అక్కడ పరిచయమైన పొలిటికల్ లీడర్ రవిరాణాని 2011లో పెళ్లి చేసుకోవడం జరిగింది. రవిరాణా మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అటు భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్ 2014లో ఎన్సీపీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె.. అక్కడ ఐదుసార్లు శివసేన ఎంపీ ఆనందరావును ఓడించి ఘన విజయాన్ని సాధించారు.
మరోవైపు మంగళవారం లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో నవనీత్ కౌర్ తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆమె తన పూర్తి మద్దతును తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతుండగా ఓ తెలుగు ఎంపీ కలగజేసుకోగా.. అతడికి తెలుగులో సమాధానమిచ్చి షాకిచ్చారు. ‘‘రెండు నిమిషాలు ఆగండి.. నాకు తెలుగు తెలుసు నేను మీరు అపోజిషన్‌లో ఉన్నాం.. ’’ అడ్డుపడకండి అంటూ హెచ్చరించారు. ఇలా ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ఇప్పుడు పార్లమెంట్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.