ఆ మృగాలనూ ఇలానే చంపేయండి

దేశప్రజలు ఇవాళ లేస్తూనే ఓ శుభవార్తను విన్నారు. షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై కీచకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. స్వతంత్ర్య భారత దేశంలో మహిళపై రేప్ చేసిన ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ‘‘ఆ మానవ మృగాలకు తగిన శాస్త్రి జరిగిందని, ఈ ఘటనతో అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే ఇకపై భయపడతారని, దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుందని, దిశకు న్యాయం జరిగిందని’’ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:41 pm, Fri, 6 December 19
ఆ మృగాలనూ ఇలానే చంపేయండి

దేశప్రజలు ఇవాళ లేస్తూనే ఓ శుభవార్తను విన్నారు. షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై కీచకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. స్వతంత్ర్య భారత దేశంలో మహిళపై రేప్ చేసిన ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ‘‘ఆ మానవ మృగాలకు తగిన శాస్త్రి జరిగిందని, ఈ ఘటనతో అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే ఇకపై భయపడతారని, దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుందని, దిశకు న్యాయం జరిగిందని’’ దేశవ్యాప్తంగా చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘‘ఈ నలుగురినే కాదు. అమ్మాయిలపై అత్యాచారం చేసి, ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్న నిందితులందరినీ ఇదే విధంగా కాల్చి చంపేయండి’’ అంటూ దేశవ్యాప్తంగా ఆక్రోశం పెల్లుబుకుతోంది.

ముఖ్యంగా దేశ రాజధానిలో సంచలనం రేపిన నిర్భయ కేసు, హాజీపూర్ మర్డర్ కేసు, కథువా గ్యాంగ్ రేప్ కేసు, పొల్లాచ్చి గ్యాంగ్ రేప్ కేసు, హన్మకొండ చిన్నారిపై అత్యాచారం కేసు, జడ్చర్ల హత్యాచారం కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరూ ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా శిక్షను అనుభవిస్తూ వస్తున్నారు. ఆయా ఘటనలు జరిగిన సమయంలో నిందితులను కాల్చి చంపేయాలంటూ డిమాండ్ వచ్చినప్పటికీ.. న్యాయస్థానాల్లో ఈ కేసులపై ఇప్పటికీ విచారణలు జరుగుతుండటంతో, వారందరూ జైళ్లలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి రేపిస్ట్‌లను ఎన్‌కౌంటర్ చేయడంతో.. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న ఆ మృగాలను కూడా చంపేయండి అంటూ అందరూ తమ గళాన్ని విప్పుతున్నారు. దీనికి సెలబ్రిటీల నుంచి కూడా మద్ధతు లభిస్తోంది. ఇక ఈ ఎన్‌కౌంటర్‌పై మాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోండి అంటూ హితవు పలికారు.

ఇదిలా ఉంటే నిర్భయ కేసులో నిందితులకు క్షమాభిక్ష పిటిషన్‌పై కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి ఓ లేఖను పంపింది. అందులో వారికి క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదంటూ హోం శాఖ వెల్లడించింది. మరోవైపు రేపిస్ట్‌లపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే ఇప్పుడున్న చట్టాలను మరోసారి సమీక్షించాలి. అత్యాచార నిందితులను క్షమాభిక్ష అవసరం లేదు. క్షమాభిక్ష పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. వాటిపై రివ్యూ జరగాలి. మహిళల రక్షణకు పౌరులు కోరుకునే చట్టం రూపొందించాల్సిన సమయం వచ్చింది’’ అని కోవింద్ అన్నారు.