ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరగనున్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌లో మార్పులు చేర్పులు , బీజేపీలో సంస్థాగత మార్పులపై ఈ సమావేశం తరువాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 4.00కు జరగనున్న ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు కూడా హాజరవుతున్నారు.
మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే అని చర్చ జరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియమాకం లాంటి కీలక నిర్ణయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. త్వరలో తెలంగాణ, మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే 2023 చివరి నాటికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బీజేపీ నాయకులు ఐదు రాష్ట్రాల్లో భేటీలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తరచుగా పర్యటనలు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే ఏకంగా నెలలో రెండు సార్లు రాష్ట్రాలకు పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. కేంద్రమంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఎప్పుడైనా మార్పులపై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలకు బలం చేకూరుతోంది. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి ఒకరికి , తమిళనాడు నుంచి ఇద్దరి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే ఎంపీల్లో ఒకిరికి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కూడా పార్టీ పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..