రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద ప్రభావంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం పరోక్షంగా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపనుంది. ఈ యుద్దంతో ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ, రక్షణ, ఆర్ధిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముడి చమురు ధరలను తగ్గించే మార్గాలు, తాజాగా పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించనున్నారు.