ఒంటరిగా పోటీ చేయాలన్నది తండ్రి కల ః చిరాగ్‌ పాశ్వాన్‌

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి.. బీహార్‌లో అంతో ఇంతో ఆదరణ ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ ఈసారి కూటమి...

ఒంటరిగా పోటీ చేయాలన్నది తండ్రి కల ః చిరాగ్‌ పాశ్వాన్‌

Updated on: Oct 15, 2020 | 12:43 PM

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి.. బీహార్‌లో అంతో ఇంతో ఆదరణ ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ ఈసారి కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తుండటంతో రాజకీయ విశ్లేషకులకు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు.. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ, చనిపోయేంతవరకు కేంద్రమంత్రిగా ఉన్న రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కూడా ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని అనుకున్నారట! ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వానే చెబుతున్నారు.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో విభేదాలు రావడంతో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించడంతో పార్టీ బాధ్యతను, ప్రచార బాధ్యతను ఆయన కుమారుడు చిరాగ్‌ తన భుజాన వేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని తమ నాన్న భావించారని, అలాగైతేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటాయని అనుకున్నారని చిరాగ్‌ అన్నారు. ఎన్‌డీఏ నుంచి విడిపోయినప్పటికీ బీజేపీతో పొత్తుకు కట్టుబడే ఉన్నామని పేర్కొన్నారు. నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామన్నారు. నితీశ్‌కుమార్‌ మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే బీహార్‌ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని చిరాగ్‌ అన్నారు. నితీశ్‌ సీఎంగా కొనసాగితే మాత్రం ప్రజలకు అంత కంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉండదని తెలిపారు. తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని, ఆయన ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు చిరాగ్‌.. ఆయన పాటించిన విలువలను కొనసాగిస్తూ ముందుకు వెళతానని చెప్పారు. అయితే చిరాగ్‌ పాశ్వాన్‌ నిర్ణయాన్ని కొందరు బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ బతికి ఉంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదంటున్నారు బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ. లోక్‌జనశక్తి పార్టీ తమకు బీ టీమ్‌ అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను సుశీల్‌ మోదీ ఖండించారు. బీహార్‌కు సంబంధించినంత వరకు లోక్‌జనశక్తి పార్టీ ఎన్‌డీఏలో భాగస్వామి కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం నితీశ్‌తో కలిసి ఓ డజను ఎన్నికల సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలను గెల్చుకుంటుందా? జేడీయూ ఎక్కువ స్థానాలను గెల్చుకుంటుందా అన్నది అప్రస్తుతమని, ఎవరు ఎక్కువ సీట్లు గెల్చుకున్నా ముఖ్యమంత్రిగా మాత్రం నితీశ్‌కుమారే ఉంటారని క్లారిటీ ఇచ్చారు సుశీల్ మోది. ఈ ఎన్నికలలో ఎల్‌జేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని అన్నారు సుశీల్‌ మోది.