ముంబైలోని హోటల్ తాజ్ ని పేల్చివేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఈ హోటల్ లోపల, బయట భద్రతను పెంచారు. గత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ ఆగంతకుడు ఈ కాల్ చేశాడని, ఇది పాక్ నుంచి వచ్చిందని తెలుస్తోంది. కరాచీ స్టాక్ ఎక్స్ ఛేంజీ పై జరిగిన టెర్రరిస్టు ఎటాక్ ని మీరు చూశారని, ఇప్పుడు తాజ్ హోటల్ పై మళ్ళీ దాడి జరుగుతుందని ఆ కాలర్ చెప్పాడు. 2008 నవంబరు 26 న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో పాక్ టెర్రరిస్టులు ఈ హోటల్ ని కూడా తమ టార్గెట్ గా చేసుకున్నారు. తిరిగి అలాంటి దాడి జరుగుతుందని ఆ కాలర్ హెచ్చరించాడట. నాటి దాడిలో 166 మంది మరణించగా, మూడు వందలమందికి పైగా గాయపడ్డారు. కాగా తాజాగా అందిన కాల్ నేపథ్యంలో ముంబై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిన్న రాత్రి వఛ్చిన ఫోన్ కాల్ నెంబర్ పాకిస్తాన్ నుంచి అందినదేనని గ్రహించారు. కరాచీ స్టాక్ ఎక్స్ ఛేంజీపై సోమవారం నలుగురు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నలుగురినీ పోలీసులు మట్టుబెట్టారు. ఆ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.