AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పై నుంచి చూస్తే ఇడ్లీ రవ్వ, రాగి పిండి.. కానీ అసలు కథ వేరే..

ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టైంది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల లగేజీలో ఇడ్లీ రవ్వ, రాగి పిండి, కార్న్‌ఫ్లోర్, పాల పొడి, ఓట్స్, నుటెల్లా వంటి ఆహార పదార్థాల్లో బంగారు పొడిని కలిపి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. మొత్తం 9.40 కిలోల 24 క్యారెట్ల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకోగా.. దాని విలువ సుమారు రూ.14.81 కోట్లుగా ఉంది.

పై నుంచి చూస్తే ఇడ్లీ రవ్వ, రాగి పిండి.. కానీ అసలు కథ వేరే..
Mumbai Airport Gold Smuggling
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 11:51 AM

Share

అక్రమ బంగారం స్మగ్లింగ్‌లో స్మగ్లర్లు అనుసరిస్తున్న అత్యంత అధునాతన పద్ధతి వెలుగులోకి వచ్చింది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్‌ కేసును ఛేదించారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల లగేజీ నుంచి రూ.14.81 కోట్ల విలువైన 9.40 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున పక్కా సమాచారం మేరకు డీఆర్ఐ ముంబై జోనల్ యూనిట్ అధికారులు, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) సిబ్బందితో కలిసి ముగ్గురు ప్రయాణికులను అడ్డుకున్నారు. వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. సాధారణంగా ఎవరూ అనుమానించని ఆహార పదార్థాల్లో బంగారాన్ని దాచి తరలించిన విషయం బయటపడింది.

బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశారంటే..

స్మగ్లర్లు గతంలో బంగారాన్ని లగేజీ బ్యాగ్ రాడ్లు, చైన్లు, షూస్, ఇతర వస్తువుల్లో దాచి తరలించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈసారి మరింత కొత్త పద్ధతిని ఉపయోగించారు. బంగారాన్ని మెత్తటి పొడిగా మార్చి.. అదే రంగు, ఆకృతి, పరిమాణంతో కనిపించే ఆహార పదార్థాల్లో కలిపి తరలించారు. ఇడ్లీ రవ్వ, రాగి పిండి, కార్న్‌ఫ్లోర్, పాల పొడి, ఓట్స్, బియ్యపు పిండి, నుటెల్లా, కొబ్బరి పాల పొడి, కేక్ మిక్స్ వంటి సాధారణ ఆహార పదార్థాల ప్యాకెట్లలో బంగారు పొడిని కలిపినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ప్రయాణికుల లగేజీ నుంచి మొత్తం 33.50 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని మిశ్రమాన్ని జాగ్రత్తగా వేరు చేసి పరీక్షలు నిర్వహించగా.. 24 క్యారెట్ల (99.99 శాతం స్వచ్ఛత) విదేశీ బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం 9.40 కిలోల బంగారం బయటపడగా.. దాని విలువ సుమారు రూ.14.81 కోట్లుగా అధికారులు తెలిపారు.

ముగ్గురు ప్రయాణికుల అరెస్ట్

ఈ కేసులో ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ చట్టం-1962 కింద అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఒకే వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణా ముఠా కోసం పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. దుబాయ్ నుంచి ముంబైకి తీసుకొచ్చిన బంగారాన్ని ఎక్కడికి తరలించాల్సి ఉంది? ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? బంగారాన్ని భారత్‌లోకి తీసుకురావడానికి గతంలోనూ ఇదే తరహా పద్ధతిని ఉపయోగించారా? ఇంకా ఏయే మార్గాల్లో బంగారం అక్రమ రవాణా జరుగుతోంది? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. బంగారం స్మగ్లింగ్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us