ఏళ్లు గడిచినా వదలని విపత్తు.. భోపాల్ విషవాయువు బాధితులకు కరోనా.. 102 మృతి చెందారన్న ఎంపీ సర్కార్..!
భోపాల్ విషవాయువు నుంచి బయటపడినా కరోనా మాత్రం కనికరించలేదు. విషవాయువు బాధితులను కరోనా మహమ్మారి కబళించిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
భోపాల్ విషవాయువు నుంచి బయటపడినా కరోనా మాత్రం కనికరించలేదు. విషవాయువు బాధితులను కరోనా మహమ్మారి కబళించిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో 1984వ సంవత్సరంలో విషవాయువు విపత్తు నుంచి బయటపడిన 254 మంది బాధితులకు కొవిడ్ -19 సోకినట్లు తెలిపింది. దీంతో వీరిలో 102 మంది కరోనా కాటుకు బలయ్యారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భోపాల్ గ్యాస్ విషాద 36వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వమించిన సభలో విషవాయువు బాధితులు కరోనాతో మరణించారని వెల్లడైంది.
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విపత్తు అయిన భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి 1984 డిసెంబరు 2వతేదీ అర్దరాత్రి మిథైల్ ఐసోసైనెట్ గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు వల్ల 15వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదు లక్షల మందికి పైగా ప్రజలు విషవాయువుతో ప్రభావితమయ్యారు. నాటి గ్యాస్ విపత్తు నుంచి బయటపడిన 102 మంది కరోనాతో కన్నుమూశారని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డైరెక్టర్ బసంత్ కుర్రే చెప్పారు.
గ్యాస్ బాధితుల కోసం పనిచేస్తున్న నాలుగు సంస్థలు భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్, భోపాల్ గ్యాస్ పీడిట్ స్టేషనరీ కర్మచారి సంఘ్, భోపాల్ గ్యాస్ పీడిట్ మహిళా పురుష్ సంగర్ష్ మోర్చా, చిల్డ్రన్ ఎగెనెస్ట్ డౌ కెమికల్స్ సంస్థల ప్రతినిధులు గ్యాస్ విషాదం నుంచి బయటపడిన వారి కుటుంబాలకు అదనపు జాతీయ పరిహారం కోరింది. గ్యాస్ లీక్ వారిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని, దీనివల్లనే బాధితులకు కరోనా సులభంగా సోకి మరణించారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆరోపించారు.