
ముంబైకి చెందిన జయశ్రీ సురేష్ గంభీర్ అనే వృద్ధురాలు తన దివంగత కుమారుడి బీమా క్లెయిమ్ కోసం ఎల్‌ఐసీ (LIC) సంస్థపై 12 ఏళ్ల పాటు జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటంలో విజయం సాధించారు. ముంబైకి చెందిన నితిన్ సురేష్ గంభీర్ (38) అనే వ్యక్తి జూన్ 2010లో ఎల్‌ఐసీలో మొత్తం రూ. 60 లక్షల విలువైన ఐదు జీవిత బీమా పాలసీలను తీసుకున్నాడు. వీటికి తన తల్లి జయశ్రీ సురేష్ గంభీర్‌ను నామినీగా పెట్టాడు. దురదృష్టవశాత్తూ, పాలసీలు తీసుకున్న మూడేళ్లకు, అంటే జూన్ 11, 2013న నితిన్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. కుమారుడి మరణం తర్వాత తల్లి జయశ్రీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా, జూలై 2014లో ఎల్‌ఐసీ ఆ ఐదు క్లెయిమ్‌లను తిరస్కరించింది. నితిన్‌కు ముందే డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ఉందని, పాలసీ ఫారమ్‌లో ఆ విషయాన్ని దాచారని ఎల్‌ఐసీ పేర్కొంది.
ఎల్‌ఐసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయశ్రీ మొదట మహారాష్ట్ర స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు. అక్కడ పాక్షిక ఉపశమనం లభించినప్పటికీ, పూర్తి న్యాయం కోసం ఆమె ఎన్‌సిడిఆర్‌సి (NCDRC) మెట్లు ఎక్కారు. ఈ కేసును విచారించిన కమిషన్ సభ్యులు డాక్టర్ ఇందర్ జిత్ సింగ్, శశి నందకియోల్యార్‌తో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మృతుడు నితిన్ ఎలాంటి ఆరోగ్య విషయాలను దాచలేదని, ఎల్‌ఐసీ క్లెయిమ్‌ను తిరస్కరించడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది. పైగా, డయాబెటిస్‌కు, అతను మరణించిన కారణమైన గుండెపోటుకు ఎలాంటి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది.
ఎల్‌ఐసీ వాదనలను పూర్తిగా తోసిపుచ్చిన కోర్టు, 2014 నుండి ఇప్పటివరకు (12 ఏళ్లు) ఏడాదికి 9 శాతం చొప్పున సాధారణ వడ్డీని లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. దీని ప్రకారం కేవలం వడ్డీయే రూ. 64.8 లక్షలు దాటింది. అసలు మొత్తం రూ. 60 లక్షలు, మానసిక వేదనకు రూ. 1 లక్ష, కోర్టు ఖర్చుల కింద రూ. 50 వేలు కలిపి మొత్తం రూ. 1,26,30,000 (రూ. 1.26 కోట్లు) నామినీ అయిన తల్లికి తక్షణమే చెల్లించాలని ఎల్‌ఐసీని ఆదేశించింది.
పాలసీదారులు మరణించినప్పుడు సాంకేతిక కారణాలు చెప్తూ క్లెయిమ్‌లను తిరస్కరించే పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ తీర్పు ఒక గుణపాఠం. ఒంటరి మహిళ అయినా సరే, ధైర్యంతో పోరాడి తన కుమారుడి హక్కును సాధించుకున్న ఈ తల్లి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..