AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: ఒడిశాలో కొలువుదీరిన కొత్త సర్కార్.. మోదీ సమక్షంలో మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం

ఒడిశాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనను అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు తరలిరాగా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్​ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు.

Odisha: ఒడిశాలో కొలువుదీరిన కొత్త సర్కార్.. మోదీ సమక్షంలో మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం
Pm Modi Mohan Charan Majhi
Balaraju Goud
|

Updated on: Jun 12, 2024 | 5:56 PM

Share

ఒడిశాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాను ఏలిన బీజేడీ పాలనను అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు తరలిరాగా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్​ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు. మోహన్​ తోపాటు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భువనేశ్వర్​లోని జనతా మైదానంలో జరిగిన ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ఇప్పుడు మాఝి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా నిలిచారు. అంతకుముందు మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో మోహన్​ చరణ్​ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు.

ఎవరీ మోహన్‌ చరణ్​ మాఝి?

ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్‌ చరణ్​ మాఝి ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగానూ పనిచేసేవారు. ఆధ్యాత్మిక భావాలు గల మోహన్ చరణ్ మాఝి విద్యార్థి దశ నుంచి ఆర్​ఎస్​ఎస్‌కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరస్వతీ విద్యామందిర్‌లో ఉపాధ్యాయునిగా పని చేశారు. తర్వాత న్యాయవాదిగా కొన్నిరోజులు పనిచేశారు. ఆ తర్వాత 1997 నుంచి 2000 వరకు మాఝి సర్పంచిగా పనిచేశారు. బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాఝి, కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకు శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.

ఇటీవల జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్‌ పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచింది. బిజు జనతా దళ్‌ 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన కాషాయ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేపీ అదరగొట్టింది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగాను 20చోట్ల కమలం పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్‌ ఓ స్థానంలో గెలుపొందింది. బిజూ జనతాదళ్‌ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..