
ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై బీజేపీ నేతలు సంబరపడుతుంటే విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. ఎగ్జిట్‌పోల్స్ పేరుతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారన్నారు. ఇండియా కూటమికి 295 ఎంపీ సీట్లు ఖాయమని , కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. “అవి ఎగ్జిట్ పోల్స్ కాదు . మోదీ మీడియా పోల్స్. ప్రజలను భ్రమల్లో పెట్టే మోదీ పోల్స్. మీరు సిద్దూ మూసేవాలా పాట విన్నారా ? ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ మేథోమథనం చేసింది. ఏఐసీసీ కార్యాయలంలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే , రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ , జైరాం రమేశ్‌తో పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. పోలింగ్ సరళిని కాంగ్రెస్ నేతలు విశ్లేషించారు. పీసీసీ అధ్యక్షులు , సీఎల్పీ నేతలతో ఖర్గే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇండియా కూటమి నేతల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎగ్జిట్‌పోల్స్ పేరుతో మోదీ డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు నేతలు విమర్శించారు.
రాహుల్‌గాంధీ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా రీకౌంటింగ్ కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాలకు ఓ గైడ్‌గా మాత్రమే పనిచేస్తాయన్నారు. ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో రాహుల్‌తో పాటు విపక్ష నేతలు ఇలాంటి అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. “రాహుల్‌గాంధీ ఎగ్జిట్ పోల్స్ రీకౌంటింగ్ కోరుకుంటున్నారని వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత. ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రొఫెషనల్ ఏజెన్సీలు చేస్తాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు రాహుల్‌గాంధీకి నచ్చకపోవడంతో అలా మాట్లాడుతున్నారు” అని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పూరి చెప్పారు.
మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య రచ్చ రాజేశాయి. కచ్చితంగా 400కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతుంటే తమకు 295 సీట్లు వస్తాయని బీజేపీ నేతలంటున్నారు.