ప్రతీ సీజన్‌లోను జల్లికట్టు క్రీడ వివాదాస్పదమవడం.. వార్తలకు ఎక్కడం పరిపాటే. సంప్రదాయం పేరిట జరిగే ఈ రాక్షస క్రీడను చూస్తుంటేనే వెళ్ళు గగుర్పాటు కలుగక మానదు. అయితే ఈసారి సంక్రాంతికి జరిగే జల్లికట్టుకు ఓ ప్రపంచాధినేత రాబోతున్న సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన రాకలో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త తమిళనాడు వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. జల్లికట్టు చూసేందుకు ఓ ప్రపంచాధినేత, ఓ అగ్రరాజ్యాధినేత వస్తున్నారన్న కథనాలు తమిళనాడునిపుడు కుదిపేస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరనేదే కదా మీ సందేహం.. రీడ్ దిస్ స్టోరీ..
తమిళనాడు ప్రజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టును చూసేందుకు అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మధురై జిల్లా పాలనా యంత్రాంగంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుతిన్ 2020 జనవరిలో తమిళనాడులోని అలంగనలూర్‌లో పొంగల్ ఉత్సవాల సందర్భంగా జరిగే జల్లికట్టును వీక్షిస్తారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింనట్లు విశ్వసనీయ సమాచారం. పుతిన్‌తోపాటు ఈ ఉత్సవాలను చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా వస్తున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.
మధురై సమీపంలోని అలంగనలూర్‌లో జరిగే జల్లికట్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. వేలాది మంది ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ఎద్దులతో ఈ క్రీడను నిర్వహిస్తారు. ఈ క్రీడను చూసేందుకు విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే.. ఈ క్రీడలో జంతువులు హింసకు గురవుతున్నాయంటూ కొందరు కోర్టులను ఆశ్రయించడంతో ప్రతీ ఏటా ఈ వివాదం ఓ తంతులాగా తెరమీదికి వస్తూ వుంటుంది. అయితే ఈ సారి అగ్రరాజ్యాధినేత రానుండడం.. ప్రధాన మోదీ స్వయంగా వీక్షించేందుకు ఉత్సాహం చూపుతుండడంతో జల్లికట్టు క్రీడ యావత్ ప్రపంచం దృష్టికీ వెళ్ళనుంది.