Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి

మనకు భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఆ యముడి పాశమైనా దరిచేరదని అంటుంటారు. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు. వాయువేగంతో వచ్చిన ఓ బస్సు స్కూటర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. అయితే అదే క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు రెప్పపాటులో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి
Kerala Road Accident

Updated on: Aug 28, 2026 | 1:57 PM

భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఆ మృత్యువు మన దరిచేరదనే సామెతకు అద్దం పట్టే ఘటన ఒకటి కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఓ భారీ ప్రమాదం నుంచి ఇద్దరు వాహనదారులు రెప్పపాటులో తప్పించుకుని మృత్యుగండం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం నుంచి ఓ ట్రావెల్స్‌ బస్సు 35 మంది పెళ్లి బృందంతో వివాహ వేడుకకు బయల్దేరింది. అయితే బస్సు సరిగ్గా కాక్కూర్‌ సమీపానికి రాగానే ఓ స్కూటర్ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది.

ఆ సమయంలో బస్సు ఫుల్‌ స్పీడ్‌లో ఉంది. ఆ స్కూటర్‌ను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై దాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఆ స్కూటర్‌నైతే తప్పించాడు. కానీ బస్సు బ్యాలెన్స్ కాకపోవడంతో అదుపుతప్పి పెట్రోల్ బంక్‌ సమీపంలో బోల్తా పడింది. బస్సు బోల్తా పడే స్థలంలోనే మరో వ్యక్తి స్కూటర్‌పై ఉన్నాడు. కానీ ఈ ప్రమాదం నుంచి అతను కూడా తృటిలో తప్పించుకున్నాడు.

రోడ్డుపై ఉన్న ఇద్దరు వాహనదారులు తప్పించుకున్నప్పటికీ, బస్సు బోల్తా పడడంతో అందులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని వెంటనే కూతట్టుకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us