ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పన్నెండు బెదిరింపులు, అది కూడా మూడు రోజుల్లో!.. విమానాలను పేల్చేస్తాం అంటూ బెదిరించడం.. ఆ తర్వాత గమ్మునుండటం! ఇలా, పలు విమాన సర్వీసులకు బెదిరింపులు రావడం దేశంలో కలకలం రేపింది. బాంబు బెదిరింపులతో రెండు మూడు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ సైతం చేయాల్సి వచ్చింది. బెంగళూరు ఫ్లైట్‌ను ఢిల్లీలో.. ముంబై-ఢిల్లీ విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా దించారు. దాంతో, వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
దేశీయ సర్వీసులతోపాటు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అమెరికా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాంతో, ఈ బాంబు బెదిరింపులను తీవ్రంగా తీసుకుంది కేంద్రం. ఏకంగా పార్లమెంటరీ కమిటీయే దీనిపై సమావేశమైంది. మూడు రోజులుగా వరుస బెదిరింపులు రావడంపై సీరియస్‌గా చర్చించింది. అయితే, ఈ బెదిరింపులు వెనక ఒక మైనర్ ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు షాక్. ఆ పిల్లాడిని చండీగఢ్‌లో అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు జువైనల్ హోమ్‌లో అప్పగించారు.
విమానాలకు బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్ తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దీంతో ఫ్రెండ్ అకౌంట్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్‌లను పెట్టినట్టు గుర్తించారు ముంబై పోలీసులు. ఎందుకు అలా చేశాడో కూపీలాగే పనిలో ఉన్నారు అధికారులు. అయితే, బాంబు బెదిరింపు కాల్స్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు దెబ్బతిన్నట్టు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. భద్రతా చర్యలను మరింత మెరుగుపర్చేందుకు ప్రపంచ భద్రత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు రామ్మోహన్‌నాయుడు.