AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీకి వెళ్లి హ్యాపీగా ఫోన్‌లో రమ్మీ ఆడుకుంటున్న మంత్రి..! మీకు ఓటేసినోళ్లకు ఓ దండం సార్‌..

శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి మొబైల్‌లో రమ్మీ ఆడిన సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజాప్రతినిధుల బాధ్యతారహిత వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభల్లో మొబైల్ ఫోన్ల వాడకం పై కూడా చర్చ జరుగుతోంది.

అసెంబ్లీకి వెళ్లి హ్యాపీగా ఫోన్‌లో రమ్మీ ఆడుకుంటున్న మంత్రి..! మీకు ఓటేసినోళ్లకు ఓ దండం సార్‌..
Minister Plays Rummy
SN Pasha
|

Updated on: Jul 21, 2025 | 6:54 AM

Share

చట్ట సభలంటే ప్రజల జీవితాలను మార్చే శాసన దేవాలయాలు. అక్కడ తీసుకునే నిర్ణయాలు కొన్ని కోట్ల మంది తలరాతను మార్చేస్తాయి. ఎన్నో వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించి, గెలిచిన ప్రజాప్రతినిధులకు జీతాలు ఇస్తూ, పోలీస్‌ బందో బస్తూ, కార్లు, క్వార్టర్లు, ఉచిత ప్రయాణాలు ఇలా ఎన్నో ప్రయోజనాలు ప్రజలు కట్టే ట్యాక్సులతో అనుభవిస్తూ.. అసెంబ్లీలో ఏసీలో చల్లగా కూర్చోని ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చించమంటే.. కొంతమంది ప్రజాప్రతినిధులు చట్ట సభలకే మచ్చ తెస్తున్నారు. గతంలో కొంతమంది చట్ట సభల్లో కూర్చోని ఏకంగా పోర్న్‌ వీడియోలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మంత్రి తన ఫోన్లో రమ్మీ ఆడుతూ కనిపించాడు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించకుండా, జరిగే చర్చపై ధ్యాస పెట్టకుండా.. ఆన్‌లైన్‌ జూదం ఆడుతున్న మంత్రిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్రలో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకాటే సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసెంబ్లీ సమావేశాల జరుగుతున్నప్పుడు మంత్రి.. ఫోన్‌లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘‘ఓ వైపు రైతుల సమస్యలపై సభలో చర్చ జరుగుతుంటే కోకాటే ఇలా వ్యవహరించారు. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఇవేమీ పట్టించుకోకుండా ఆయన ఆటలాడుతున్నారు’’ అని రోహిత్‌ మండిపడ్డారు. కోకాటేపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు శివసేన (యూబీటీ) నేత ఆనంద్‌ దుబే సైతం విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కోకాటే.. ‘‘నేను యూట్యూబ్‌ వీడియో చూస్తున్నప్పుడు రమ్మీ ఆటకు సంబంధించిన యాడ్‌ వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. రెండు సార్లు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాను. ప్రతిపక్షాలు కావాలనే అసంపూర్తి వీడియోపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

అయితే సెల్‌ఫోన్‌లను చాలా చోట్లకు అనుమతించరు, విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే, అలాగే ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులు స్కూల్స్‌లో మొబైల్‌ ఫోన్స్‌ వాడొద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మరి వీరందరికంటే ఎంతో బాధ్యత కలిగి ఉండి, కొన్ని కోట్ల మంది జీవితాలను శాసించే చట్ట సభల్లో కూడా మొబైల్‌ ఫోన్స్‌ను అనుమతించకుంటే బాగుంటుందని కదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా చేస్తే అయిన ప్రజా ప్రతినిధులు చర్చపై దృష్టి పెడతారా అనే విషయం పక్కనపెడితే.. కనీసం ఇలా పోర్న్‌ చూస్తూ, రమ్మీ ఆడుతూ చట్ట సభల పరువు అయినా తీయ్యకుండా ఉంటారు కదా అని నెటిజన్లు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి