
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సంక్షోభం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం కావడంతో ప్రభుత్వం ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటు ఉభయ సభల్లో పశ్చిమ ఆసియా పరిస్థితిపై ప్రకటన చేసి దేశ ప్రజలకు భరోసా కల్పించారు.
భారతదేశ ఇంధన అవసరాల్లో మెజారిటీ భాగం హోర్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం అత్యంత కీలకంగా మారింది. ఎల్‌పీజీ నిల్వలతో ఉన్న 4 భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి ఇప్పటికే భారత్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత నౌకల రక్షణ కోసం ప్రభుత్వం నిరంతరం సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. 140 కోట్ల మంది ప్రజల అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులను బేరీజు వేసుకుంటూ భారత్ తన ఇంధన సేకరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలను పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత స్టాక్ ఉంది. సరఫరా వ్యవస్థ పూర్తిగా నియంత్రణలో ఉంది. కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పౌరులు అటువంటి వార్తలను నమ్మవద్దని మంత్రిత్వ శాఖ కోరింది.
భారతదేశం తన ఇంధన భద్రత విషయంలో మూడు ప్రధాన సూత్రాలను అనుసరిస్తోంది..