
తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగే చిత్తిరై ఉత్సవం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో భాగంగా మీనాక్షి సుందరేశ్వరులు స్వర్ణ పల్లలో కూర్చుని వైభవంగా వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. అయితే ఈ అమ్మవారి ఊరేగింపు ముఘాయిద్దీన్ అండవర్ మసీదు మీదుగా వెళుతుండగా ముస్లింలు భక్తులకు, పూజారులకు చల్లని రోజ్ మిల్క్, స్వీట్స్ ను అందించారు. ఆలయ అర్చకులు మసీదు ప్రతినిధికి పూలమాల సమర్పించారు. హిందూ ముస్లింలు పరస్పర గౌరవాన్ని చాటుకుంటూ మీనాక్షి ఊరేగింపులో ఇలా రోజ్ మిల్క్, స్వీట్స్ భక్తులకు ఇచ్చే సంప్రదాయం దాదాపు 26 సంవత్సరాలుగా కొనసాగుతోంది.
మీనాక్షి అమ్మన్ ఊరేగింపులో పాల్గొన్న వందలాది మంది భక్తులకే కాదు భద్రతలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి కూడా మసీదు తరపున రోజ్ మిల్క్ అందించారు. “ప్రపంచ ప్రఖ్యాత మధురై చితిరై పండుగలో నాల్గవ రోజున ప్రతి సంవత్సరం ఇలా మసీదు మీదుగా మీనాక్షి అమ్మన్ ఊరేగింపు సమయంలో భక్తులకు గులాబీ పాలు, స్వీట్లు అందించడం ఆచారం అని మసీదు నిర్వాహకుడు కమరుద్దీన్ చెప్పారు.
మత సామరస్యానికి ఇది ఒక ఆదర్శప్రాయమైన సంఘటనగా మేము భావిస్తున్నాము. ఈ రకమైన మత సామరస్యం దేశం అంతా కొనసాగాల.. ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని అందరూ ప్రార్థించాలని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..