Mayawati: రోజురోజుకీ తగ్గిపోతున్న మాయావతి ప్రభ.. బీజేపీకి దగ్గరకావడం వెనుక లెక్క ఇదేనా..?

|

Aug 04, 2022 | 5:24 PM

మయావతి బీజేపీకి దగ్గరవుతుందనే విమర్శలు రాజకీయ ప్రత్యర్థులనుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి సమర్థించనప్పటికి.. తాజా పరిస్థితులు మాత్రం మాయావతి వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.

Mayawati: రోజురోజుకీ తగ్గిపోతున్న మాయావతి ప్రభ.. బీజేపీకి దగ్గరకావడం వెనుక లెక్క ఇదేనా..?
BSP Chief Mayawati
Image Credit source: TV9 Telugu
Follow us on

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఈ డైలాగ్ ఏదో ఒక రంగానికే కాదు.. అన్ని రంగాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగానికి ఇది కరెక్ట్ గా సూటవుతుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించి.. ప్రస్తుతం ప్రజాదరణ కోల్పోతున్న నాయకులు ఎంతో మందిని చూస్తున్నాం. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయవతి(BSP Chief Mayawati) పరిస్థితి ఇలానే ఉంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె ప్రభ క్రమేపీ తగ్గుతోంది. ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మాయవతి నేతృత్వంలోని BSP ఒక్క స్థానంలోనే గెలిచింది. గతంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆమె సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఈ పరిస్థితికి రావడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.

పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రస్తుతం ఆ పార్టీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీనికి స్వయంకృతపరాదమే కారణంగా తెలుస్తోంది. ఏదైనా ఒకపార్టీ తనకు తానుగా బలపడేందుకు చూస్తుంది. కాని ఇటీవల జరిగిన అజంఘడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు బీఎస్పీ తీవ్ర ప్రయత్నమే చేసింది. ఫలితంగా ఎస్పీ ఎంతో బలంగా ఉన్న నియోజకవర్గంలో బీజేపీ గెలుపుబావుట ఎగురవేసింది. దీంతో మయావతి బీజేపీకి దగ్గరవుతుందనే విమర్శలు రాజకీయ ప్రత్యర్థులనుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి సమర్థించనప్పటికి.. తాజా పరిస్థితులు మాత్రం మాయావతి వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. విపక్షాలంతా జతకట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అయితే వారిలో అనైక్యత విపక్షాల లక్ష్యానికి తూట్లుపొడుస్తున్నాయనే చెప్పుకోవాలి.

బీఎస్పీ అదినేత్రి మాయవతి కేవలం దళిత్, వెనుకబడిన వర్గాల ఓటుబ్యాంకును నమ్ముకోవడంతో ఆపార్టీ ప్రాభావం తగ్గిపోయిందన్న వాదన ఉంది. దళితుల్లో హిందువులు, వెనుకబడిన వర్గాలోని చాలా మంది కాషాయపార్టీకి మద్దతివ్వడంతో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం బీఎస్పీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్‌కు బీఎస్పీ మద్దతు ప్రకటించినప్పటికి.. ఇందులో పెద్ద ఆశ్చర్యమేమి కన్పించలేదు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్‌ విజయం సాధించడం దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. బీఎస్పీ మద్దతుతో ఆయనకు వచ్చే అధిక్యం మాత్రమే పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

బీఎస్పీకి లోక్ సభలో 11 మంది, రాజ్యసభలో ఒక సభ్యుడి బలం మాత్రమే ఉంది. కావున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాయవతి పార్టీ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం లేదు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యస్వంత్ సిన్హాను ఎంపికచేసే సమయంలో తమను సంప్రదించలేదని.. అందుకే ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చినట్లు గతంలో మాయవతి ప్రకటించారు. ప్రస్తుతం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీష్ ధన్‌ఖర్‌కు మద్దతిస్తున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.

మరోవైపు మాయవతి పార్టీ రాజకీయంగా తన ఉనికిని కోల్పోతుండటంతో ఆమె బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఇటీవల తన వైఖరిలో మార్పురావడంతో పాటు కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడంలేదనే వాదన వినిపిస్తోంది. కానీ మాయవతి డైరెక్ట్ గా బీజేపీకి మద్దతు ప్రకటించడానికన్నా ఒంటరిగా పోటీ చేయడం ద్వారానే ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి కలిసివస్తుందనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి దీటైన పార్టీ దేశంలో ఏది లేకపోవడంతో రాజకీయంగా ఉనికిని చాటుకోవాలంటే ఎన్డీయేకి దగ్గరగా ఉంటేనే బెటర్ అనే ఆలోచనలో బీఎస్పీ అధినేత్రి ఉన్నట్లు కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

(అమర్నాథ్, టీవీ9 తెలుగు,  హైదరాబాద్)

మరిన్ని జాతీయ వార్తలు చదవండి