Maoists demands dialogue with government: ఏప్రిల్ 3వ తేదీన తెర్రం కొండల్లో దారుణంగా దాడి చేసి 24 మంది వీర జవాన్లను బలితీసుకున్న మావోయిస్టులిపుడు శాంతి మంత్రం వల్లించడంపై భిన్నరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత పదేళ్ళ కాలంలో పలు గెరిల్లా దాడులతో వందలాది మంది సెక్యురిటీ ఫోర్సెస్‌ని పొట్టన పెట్టుకున్న మావోయిస్టులు ఇపుడు ఒక పోలీసు కమాండర్ విడుదలకు చర్చల ప్రస్తావన తీసుకురావడం విచిత్రంగా వుందని కొందరంటుంటే.. మరికొందరు జవాన్ కుటుంబం కోసం ప్రభుత్వం తక్షణమే మధ్యవర్తిని నియమించి మావోయిస్టులతో సంప్రదింపులు జరపాలని అంటున్నారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యం ఒకవైపు.. గత 17 సంవత్సరాలుగా (పీపుల్స్ వార్ గ్రూపు, మావోయిస్టు సెంటర్ కలిసి సీపీఐ (మావోయిస్టు)గా మారిన తర్వాత నుంచి) మితి మీరిన హింసాత్మక చరిత్ర మరోవైపు వెరసి చర్చలకు ఆస్కారముందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
తమ వద్ద బందీగా వున్న రాకేశ్వర్ సింగ్ అనే జవానును విడుదల చేసేందుకుగాను మధ్యవర్తులతో సమాలోచనలకు తాము సిద్దమని మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వారితో చర్చలు జరపనుందా? అన్న చర్చ తాజాగా మొదలైంది. ఈక్రమంలోనే కేవలం రాకేశ్వర్ సింగ్ విడుదల అంశమే కాకుండా పూర్తి స్థాయిలో మావోయిస్టులతో చర్చలకు అవకాశముందా అనే విషయం కూడా తెరమీదికి వచ్చింది. ప్రభుత్వం మధ్య వర్తుల పేర్లు ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న జవాన్‌ను అప్పగిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకటన విడుదల చేశాడు.
గతంలో 2012లో ఛత్తీస్ గఢ్‌లో ఐఏఎస్ అధికారి అలెక్స్ పాల్ మీనన్‌ను అపహరించిన సందర్భంలోను మావోయిస్టులకు రెడీ అయ్యారు. అప్పుడు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి, మావోయిస్టులతో చర్చలు జరిపింది. చర్చలు విజయవంతమవడంతో మావోయిస్టులు అలెక్స్ పాల్‌ను విడుదల చేశారు. 2017లో సుక్మా జిల్లాలోని కిస్తారాం ప్రాంతంలో కెనడియన్ జాతీయుడు జాన్ స్లాజాక్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అప్పుడు కూడా మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇపుడు రాకేశ్వర్ సింగ్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
అయితే.. మావోయిస్టులు అంతమయ్యారని, అక్కడా ఇక్కడా ఏరి వేసినట్లుగానే మావోయిస్టు ఉద్యమం వుందని పలు మార్లు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ భీషణ ప్రకటనలు చేశారు. ఇలా ప్రకటనలు వెలువడిన ప్రతీసారి మావోయిస్టులు తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతూనే వున్నారు. పదుల సంఖ్యలో భద్రతా బలగాల సిబ్బందిని బలితీసుకుంటూనే వున్నారు. శాంతి చర్చల విషయంపై గతంలో ఏం జరిగిందని పరికిస్తే.. చర్చలు మావోయిస్టులకే ఉపయోగపడినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టులు బలపడ్డారన్న విషయం తాజా దాడితో తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి బఘేల్ ప్రకటనల్లో డొల్లతనం తాజా దాడితో బయటపడింది.
గత 40 ఏళ్లుగా బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3,200కు పైగా ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. జనవరి 2001 నుంచి 2019 మే వరకు 1,002 మంది మావోయిస్టులు మృతి చెందగా.. వివిధ ఘటనల్లో 1,234 మంది భద్రతా సిబ్బంది తమ విధి నిర్వహణలో అసువులు బాసారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన పలు కాల్పుల ఉదంతాలలో 1782 మంది సాధారణ జనం కూడా మరణించడం విషాదం. ఈ క్రమంలోనే 3,896 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. గత సంవత్సరం కరోనా కాలంలోను పలు మార్లు ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2020 నవంబర్ 30 నాటికి ఆ సంవత్సరంలో 31 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. 270 మామావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.
అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులు పలు సందర్భాలలో పరస్పరం చర్చలకు సిద్దమని ప్రకటనలు చేస్తూనే వున్నారు. కానీ చర్చలపై ఇరు పక్షాలకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లు గత ఉదంతాల ద్వారా అర్థమవుతోంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను అంతకు ముందు ఇచ్చిన హామీ మేరకు నక్సల్స్‌తో చర్చలకు సిద్దపడ్డారు. హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌజ్ వేదికగా నక్సల్స్‌తో వైఎస్ ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితేనేం ఆ చర్చలు పెద్దగా ఫలించలేదు. సరికదా.. ఆ తర్వాత కొంత కాలానికే మావోయిస్టులగా మారిన నక్సల్స్ మరింతగా హింసా మార్గాన్ని అనుసరించారు. దాంతో ఉభయ పక్షాలు చర్చలను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని బోధపడుతోంది.
బస్తర్ నుంచి భద్రతా దళాలను వెనక్కి పిలవాలని మావోయిస్టు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపధ్యంలో కొద్ది రోజుల క్రితం శాంతి చర్చలకు మావోయిస్టులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే.. మావోయిస్టుల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ముందు మావోయిస్టులు తమ ఆయుధాలను వదలాలని, ఆ తర్వాత చర్చల ప్రస్తావన చేయాలని అధికారులంటున్నారు. ఆయుధాలను ముందుగా వదిలేందుకు మావోయిస్టులు ససేమిరా అనడంతో చర్చల విషయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోతోంది.
ఏజెన్సీలో అటెన్షన్
చత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు అలెర్ట్ అయ్యారు. గతంలో పంచాయతీ ఎన్నికలను మావోయిస్టులు బహిష్కరించారు. అయినా సరే పోటీలో నిలిచిన ఒక అభ్యర్థి దంపతులను తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఆతర్వాత టీడీపీ నేత, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఇప్పుడు ఇదే తరహా ఘటనలు ఏపీలో జరుగుతాయా అనే చర్చ సాగుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీలోకి మావోయిస్టులు ప్రవేశించారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఏజెన్సీ గ్రామాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులకు టెన్షన్ పట్టుకుంది. పరిషత్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు పోలీసులకు నేతలకు జాగ్రత్తలు చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు మారు మూల ప్రాంతాలకు వెళ్లక పోవడమే మంచిదని చెబుతున్నారు.
ALSO READ: తెరమీదికి మళ్ళీ రాఫేల్ రచ్చ.. ముడుపుల కథనంతో కస్సుమన్న కాంగ్రెస్.. అసలేంటి మేటర్?