Man Finds 26.11 Carat Diamond: అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో అస్సలు అంచనా వేయలేం, ఊహించలేం.. అందుకే అందరూ.. మన ప్రయత్నం ఉన్నా.. ఆవగింజ అంత అదృష్టం అయినా ఉండాలంటారు పెద్దలు. తాజాగా.. అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. ఏదో చిన్న బట్టీ (Mine) లీజుకు తీసుకోని కష్టపడుతున్న ఓ వ్యక్తి కోట్లాది రూపాయల వజ్రం దొరికింది. దీంతో అతను రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని పన్నా జిల్లాలోని నిస్సారగనిలో చిన్న తరహా ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తికి 26.11 క్యారెట్ల వజ్రం దొరికినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. వేలంలో దీని విలువ రూ.1.20 కోట్ల వరకు పలుకుతుందని పన్నా (Panna) వజ్రాల అధికారి రవి పటేల్ వెల్లడించారు. పన్నా పట్టణంలోని కిషోర్‌గంజ్ నివాసి సుశీల్ శుక్లా, అతని కుటుంబసభ్యులు కృష్ణ కల్యాణ్‌పుర్ ప్రాంతంలోని గనుల్లో సోమవారం ఈ వజ్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. దీనిని త్వరలో వేలం వేస్తామని.. వచ్చిన మొత్తంలో పన్నులు, రాయల్టీ పోగా మిగిలిన మొత్తం శుక్లాకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
అద్దెకు తీసుకున్న భూమిలో చిన్న తరహా ఇటుక బట్టీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న శుక్లా మాట్లాడుతూ.. తాను, తన కుటుంబం గత 20ఏళ్లుగా మైనింగ్ పనులు చేస్తున్నామని.. ఇంత విలువైన వజ్రం లభించడం ఇదే తొలిసారి అని చెప్పాడు. వజ్రం దొరికిన నిస్సార గనిని ఐదుగురు భాగస్వాములతో కలిసి లీజుకు తీసుకున్నట్లు శుక్లా వివరించాడు. ఈ వజ్రానికి రూ.1.2 కోట్లకు పైగా పలుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
వజ్రం వేలం తర్వాత తనకు వచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తానని తెలిపాడు. ఎంపీ రాజధాని భోపాల్ నుంచి 380 కి.మీ దూరంలో ఉన్న పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల విలువైన వజ్రాల నిల్వలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: