శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. తన్మయత్వానికి లోనైన అయ్యప్ప భక్తులు

అయ్యప్ప స్వాముల కళ్లలో వెలుగులు నింపే అద్భుత ఘట్టం సాక్షాత్కారమైంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చిన ఈ శుభ తరుణాన లక్షలాది మంది భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. అయితే, భక్తుల రద్దీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉండటంతో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి పలు ఆంక్షలు విధించారు.

శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. తన్మయత్వానికి లోనైన అయ్యప్ప భక్తులు
Makara Jyothi Darshan

Updated on: Jan 14, 2026 | 7:20 PM

ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న తరుణం! మకరజ్యోతి దర్శనం సాక్షాత్కారమైంది. జ్యోతి దర్శనంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. భక్తులు పొన్నంబలమేడు దగ్గర ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శించారు. అయ్యప్ప భక్తులు చేతులు జోడించి శరణం జపిస్తూ మకర జ్యోతిని వీక్షించారు.  ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు.

శబరిమల దేవస్వం బోర్డు కఠిన నిబంధనలు

జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శబరిమల దేవస్వం బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేశారు. ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో, సన్నిధానం దగ్గర అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.

కాలినడక మార్గాలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు

భక్తుల రద్దీ దృష్ట్యా కాలినడక మార్గాల్లోనూ, వాహనాల రాకపోకల పైనా కేరళ పోలీసులు ఆంక్షలు విధించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను నీలక్కల్ వద్ద కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని, అక్కడి నుండి ప్రత్యేక బస్సుల ద్వారా పంబాకు చేరుకోవాలని సూచించారు. అటవీ మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సూచనలు పాటించాలని, ప్రయాణ ప్రణాళికలను అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా “స్వామియే శరణం అయ్యప్ప” అనే శరణుఘోషతో శబరిమల అంతా ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. ఆ దివ్య జ్యోతి దర్శనంతో భక్తులంగా మనసునిండా ఆ అయ్యప్పను నింపుకుని తిరిగి ఇళ్లకు పయనమయ్యారు.

మకర జ్యోతి.. మకర విళుక్కు.. రెండూ  మణికంఠుడి మహిమాన్వితాలకు ప్రతీకలే. మకర జ్యోతి..అయ్యప్ప తేజోమయ నక్షత్రం.మకర విళుక్కు..అయ్యప్పకు గిరిపుత్రుల దీపనీరాజనం.  నిత్యం యోగముద్రలో ఉండే మణికంఠుడు,  భక్తులను అనుగ్రహించడానికి సంక్రాంతి రోజు తన తపస్సుకు విరామం ఇచ్చి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారనేది భక్తుల విశ్వాసం.

కందమాల పర్వతంలో  బుషులు, దేవతలు అయ్యప్పకిచ్చే హారతే మకర జ్యోతి అని భావిస్తారు భక్తులు. సాక్షాత్తూ అయ్యప్పస్వామి ఈ జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని నమ్ముతారు. ముల్లోకాలను కరుణిస్తూ  పొన్నంబళమేడు నుంచి మూడు సార్లు  మకర జ్యోతి దర్శనం..  ఈ అద్భుత దృశ్యంతో అశేష భక్తులకు  కలిగే ఆధ్యాత్మిక అనుభూతి గురించి చెప్పతరమా! అయప్ప నామస్మరణలతో భక్త పారవశ్యం అనిర్వచనీయం.
మకర జ్యోతి దర్శనానికి ముందు సన్నిధానంలో  వైభోవోపేతంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పందళరాజ వంశీయులు తిరువాభరణలతో కూడిన మూడు పెట్టెలను శిరస్సున పెట్టుకొని  సన్నిధానం చేరుకున్నారు. ఆ సమయంలో  గరుడ పక్షి ఆకాశంలో విహరించింది. ఆ దృశ్యాలను  భక్తులు ఎంతో ఆసక్తితో చూశారు. అక్కడి వాతావరణం ఒక్కసారిగా భక్తిభావంతో  ఉద్వేగభరితంగా మారింది. సన్నిధానం చేరుకున్న పందళరాజ వంశీయులను  ఆలయ ప్రధాన తంత్రి సాదరంగా స్వాగతించారు.  మూడు పెట్టెల్లోని స్వర్ణాభరణాలను స్వామికి అలంకరించారు. ఆ తరువాతే ఆకాశ దీపంలా పొన్నాంబలమేడులో మకర జ్యోతి దర్శనం అయింది.

మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందారు స్వాములు.