
దేశంలో మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇంటిలిజెన్స్ బ్యూరో, జమ్ముకశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. 300 కేజీల RDX, ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం, జమ్ముకశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. డాక్టర్ ఆదిల్ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే భద్రతా సంస్థలు ఫరీదాబాద్‌పై దృష్టి సారించాయి.
ఫరీదాబాద్‌లోని ఈ వైద్యుడిని కాశ్మీర్‌కు చెందిన ముజాహిల్ షకీల్‌గా గుర్తించారు. నవంబర్ 6న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కి మద్దతుగా పోస్టర్లు అతికించారనే ఆరోపణలతో డాక్టర్ ఆదిల్ రాథర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు ఇతని ఇంట్లోనే RDX, ఏకే 47 వంటి ఆయుధాలు లభ్యమయ్యాయి. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాశ్మీర్ నుండి మొదలుపెట్టి హర్యానా వరకు విస్తరించిన ఒక పెద్ద ఉగ్రవాద లాజిస్టిక్స్ నెట్‌వర్క్ దీని వెనుక ఉందని అధికారులు చెబుతున్నారు. వైద్య వృత్తిలో ఉన్నవారిని ఈ కుట్రకు సహాయకులుగా వాడుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆపరేషన్‌ను పాకిస్తాన్ నుండి నడిపించి ఉండవచ్చని, వారు ఇతరులకు దొరకకుండా ఉండేందుకు ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల ద్వారా ప్లాన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
దేశంలో RDX కు చాలా భయంకరమైన చరిత్ర ఉంది.1993 ముంబై పేలుళ్లు: 257 మంది చనిపోయిన ఆ దాడుల్లో RDX నే వాడారు. 2019 పుల్వామా దాడిలో 40 మంది CRPF జవాన్లు చనిపోయిన కారు బాంబు దాడిలో కూడా ఇదే RDX ను ఉపయోగించారు. గతంలో జరిగిన దాడుల్లో వాడిన RDX కూడా సరిహద్దుల అవతల నుంచే వచ్చింది. ఇప్పుడు దొరికిన 300 కిలోల RDX కూడా అక్కడి నుంచే వచ్చిందని భద్రతా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కాశ్మీర్ నుంచి హర్యానాకు ఎలా వచ్చింది..? అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.