Maharashtra – Temples – Gujarat: మహారాష్ట్రలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. నాసిక్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో నాసిక్ లోని చాలా ఆలయాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అటు, గుజరాత్‌లోనూ భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజ్‌కోట్, జామ్‌నగర్ ప్రాంతాల్లో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. జామ్‌నగర్‌లో వరదనీటిలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. జామ్‌నగర్‌లో ఎక్కువగా లగ్జరీ కార్లు వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఓనర్లు లబోదిబోమంటున్నారు.
గుజరాత్ లోని పలు జిల్లాలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా డ్యాంలు నిండిపోయాయి. రాజ్‌కోట్‌లో చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసిన భూపేంద్రపటేల్‌తో హోంశాఖ మంత్రి అమిత్‌షా వరద సహాయక చర్యలపై మాట్లాడారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యల్లో ఎయిర్‌ఫోర్స్ బృందాలు పాల్గొంటున్నాయి.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని, ఈ ఉదయం ఆ వాయుగుండం ఒడిశా తీరాన్ని తాకిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వాయుగుండం ప్రభావంతో దేశంలోని పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ది. ప్రస్తుతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఆ వాయుగుండమే కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.