Maharashtra state board exams: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడంతో 10, 12వ తరగతి స్టేట్ బోర్డు ఎగ్జామ్స్‌ను వాయిదా వేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు.
మే నెలలో పదో తరగతి, జూన్ నెలలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు స్టేట్ ఎగ్జామ్స్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఏడాది జరగాల్సిన వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్షలు జరగాల్సిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా పరిస్థితులు లేవన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, సాంకేతిక దిగ్గజాలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు.
మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్
? Imp Announcement: Given the current #COVID-19 situation in Maharashtra, we’ve postponed state board exams for class 10th & 12th. The present circumstances are not conducive for holding exams. Your health is our priority. #PariskhaPeCharcha #HSC #SSC #exams (1/5) pic.twitter.com/cjeRZAT7ux
— Varsha Gaikwad (@VarshaEGaikwad) April 12, 2021
మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే యోచనలో మహారాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తే తప్ప రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడిచేయడం సాధ్యంకాకపోవచ్చని నిపుణులు సూచించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ దిశగా అడుగువేస్తున్నట్లు సమాచారం. సెకండ్ వేవ్‌లో బాగంగా కోవిడ్ వ్యాధి లక్షణాలు లేనివారితోనే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని ఆదివారం జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించింది. టాక్క్‌ఫోర్స్ బృందం నిర్ణయం మేరకు కరోనా వైరస్ కట్టడికి కఠిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.
ఇదిలావుంటే, ఆదివారం, మహారాష్ట్రలో కొత్తగా 63,294 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, దేశంలోకి మహమ్మారి ప్రవేశించిన తరువాత అత్యధికంగా ఒకే రోజు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 34,07,245 కరోనా కేసులు నమోదయ్యాయి.