Ratan Tata: రతన్‌ టాటాకు భారతరత్న కోరుతూ మహారాష్ట్ర కేబినెట్‌ తీర్మానం

రతన్‌టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు హారాష్ట్ర మంత్రిమండలిలో తీర్మానం చేశారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Ratan Tata: రతన్‌ టాటాకు భారతరత్న కోరుతూ మహారాష్ట్ర కేబినెట్‌ తీర్మానం
Maharashtra Cabinet Meeting

Updated on: Oct 10, 2024 | 1:09 PM

ముంబైలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సేవా రంగాల్లో అతని సేవలు అనితరమైనవవి అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతిపై సంతాప ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.

టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం రాత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటాకు సంబంధించి ఒక రోజు సంతాప దినం ప్రకటించింది . 2008 ముంబై దాడి తర్వాత రతన్ టాటా చూపిన దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సీఎం షిండే ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు . “ఆయన తీసుకున్న దృఢమైన నిర్ణయాలు, ధైర్యవంతమైన వైఖరి, సామాజిక నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దివంగత రతన్‌జీ టాటా అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ గౌరవాలతో నిర్వహించబడతాయి” అని ముఖ్యమంత్రి చెప్పారు. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

ముంబైకి క్యూ కట్టారు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు. రతన్‌ టాటాకు కడసారి నివాళి అర్పించేందుకు తరలివస్తున్నారు దిగ్గజాలు. ఆనంద్‌ మహింద్ర, శరద్‌పవార్‌ రతన్‌ టాటాకు నివాళి అర్పించారు. రతన్ టాటా మృతితో శోక సంద్రంగా మారింది ముంబై పట్టణం.

రతన్‌టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. రతన్‌టాటాకు సీఎం చంద్రబాబు, మంత్రుల నివాళులు అర్పించారు. అటు రతన్‌టాటా భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ముంబై బయలుదేరి వెళ్లారు చంద్రబాబు.. ఆయన వెంట పలువురు మంత్రులు కూడా వెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..