చెన్నై అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్ధిని సామూహిక లైంగిక దాడి ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్‌లతో సిట్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ లీక్ కావడంపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. సీక్రెట్‌గా ఉండాల్సిన ఎఫ్‌ఐఆర్ 14 మందికి ఎలా చేరిందని న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలికి , ఆమె కుటుంబ సభ్యులకు వెంటనే రక్షణ కల్పించాలని ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి తక్షణసాయంగా రూ. 25 లక్షలు చెల్లించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
డిసెంబర్ 25వ తేదీన అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై బిర్యాని వ్యాపారి క్యాంపస్‌లో అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అంతేకాకుండా తనను తాను కొరడా దెబ్బలు కొట్టుకొని వినూత్నరీతిలో ఆయన నిరసన తెలిపారు. విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడు కోట్టూరుకు చెందిన జ్ఞానశేఖరన్‌గా గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..