Madhya Pradesh: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైన వింత సంఘటనలు జరిగినా వెంటనే బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని (Brahmam Gari Kalagnanam) గుర్తు చేసుకుంటాం. ఆవు పాలు పంది పిల్ల తాగడం, పంది కడుపున ఆవు పుట్టడం వంటి అనేక వింత సంఘటనల నుంచి మొన్న కరోనా వైరస్ (Corona Virus) వరకూ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లే జరిగాయి.. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ వింత శిశువు జన్మించింది. రెండు తలలు, మూడు చేతులతో పుట్టిన ఈ చిన్నారికి వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. జావ్రాగ్రామానికి చెందిన షాహీన్ అనే మహిళ పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. పుట్టిన శిశువుకి రెండు తలలు, మూడు చేతులున్నాయి. అయితే మూడవ చేయి రెండు ముఖాల మధ్య వెనుక వైపు ఉంది. చిన్నారిని రత్లామ్‌లోని SNCUలో కొంత సమయం ఉంచి.. మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌లోని MY హాస్పిటల్‌కు శిశువును రిఫర్ చేశారు. చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
ఆపరేషన్ కు ముందు షహీన్ కు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో కవలలులా కనిపించారని.. తీరా ప్రసవం అయిన తర్వాత చూస్తే.. శిశువు రెండు తలలతో జన్మించిందని ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవేద్ ఖురేషీ చెప్పారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని పాలీసెఫాలీ కండిషన్ అంటారని, అతికొద్ది మంది చిన్నారులు ఇలా అత్యంత అరుదుగా జన్మిస్తారని చెప్పారు. అంతేకాదు చాలా మంది పిల్లలు కడుపులోనే చనిపోతారు లేదా పుట్టిన 48 గంటల్లోపే చనిపోతారు. అటువంటి సందర్భాలలో శస్త్రచికిత్స చేసినప్పటికీ ఇలా అరుదుగా పుట్టిన పిల్లలు 60 నుంచి 70 శాతం మంది బతకడం జరగలేదని చెప్పారు.