Students Strike: టీచర్ బదిలీని నిలిపివేయాలంటూ ఐదు రోజులుగా విద్యార్థుల ఆందోళన.. లేదంటే..!

గురువు, శిష్యుల మధ్య అద్వితీయమైన అనుబంధం ఉంటుందంటారు. ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయినప్పుడు పాఠశాలలోని పిల్లలందరూ ఏడుస్తూ, బదిలీని ఆపాలని సమ్మెకు కూర్చున్నప్పుడు ఈ అపూర్వ సంబంధం కనిపించింది.

Students Strike: టీచర్ బదిలీని నిలిపివేయాలంటూ ఐదు రోజులుగా విద్యార్థుల ఆందోళన.. లేదంటే..!
Students Strike

Updated on: Sep 26, 2024 | 4:06 PM

గురువు, శిష్యుల మధ్య అద్వితీయమైన అనుబంధం ఉంటుందంటారు. ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయినప్పుడు పాఠశాలలోని పిల్లలందరూ ఏడుస్తూ, బదిలీని ఆపాలని సమ్మెకు కూర్చున్నప్పుడు ఈ అపూర్వ సంబంధం కనిపించింది. గత 5 రోజులుగా పాఠశాల విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లో టీచర్ల బదిలీని ఆపకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌లోని సిహోరా బ్లాక్‌లోని పారాస్‌వాడ హై సెకండరీ స్కూల్‌లో జరిగింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉన్న అపూర్వ బంధం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల ఉపాధ్యాయుడు రాంశరణ్ బగ్రీని బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులు నిరసనకు దిగారు.

రాంశరణ్ బగ్రీ 2006 నుండి హై సెకండరీ స్కూల్, పరాస్‌వాడలో బోధిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేస్తున్నారు. అతను విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా, పాఠశాల పరిస్థితిని కూడా చాలా మెరుగుపరిచారు. ఈ పాఠశాల నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర ఉపాధ్యాయులు ఇక్కడికి రావడానికి వెనుకాడుతుంటారు. అయినప్పటికీ, రాంశరణ్ బగ్రీ ఈ పాఠశాలను పునరుద్ధరించారు. దీని కారణంగా ఇక్కడ విద్య నాణ్యత పెరిగింది. ఫలితంగా పాఠశాల ఫలితాలు 80-90%కి చేరుకుంది. ఈ పాఠశాల ఫలితం జబల్‌పూర్ జిల్లాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇది ఉపాధ్యాయుడు రామ్‌శరణ్ బగ్రీ తన విధుల్లో ఎంత కష్టపడి పనిచేశాడో స్పష్టం చేస్తుంది.

రామ్‌శరణ్ బగ్రీ బదిలీ వార్త తెలియగానే విద్యార్థులు నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. తమ అభిమాన ఉపాధ్యాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని విద్యార్థులు బీష్మించుకుని కూర్చున్నారు. కొంతమంది విద్యార్థులు ఏకంగా తమ టీచర్‌ను బదిలీ చేస్తే పాఠశాల నుండి తమ పేర్లను తొలగించి, టిసి తీసుకుంటామని చెప్పారు. బగ్రీ సార్ తనకు చదువులో సాయపడటమే కాకుండా జీవితంలో ముందుకు వెళ్లేందుకు స్ఫూర్తినిచ్చారని చెప్పారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, అలాంటి సమయంలో మా టీచర్లు మనకు దూరమవుతున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు.

ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుడు రాంశరణ్ బగ్రీ పిల్లలకు చదువు చెప్పడమే కాకుండా మొత్తం పాఠశాల వాతావరణాన్నే మార్చేశారని పేరెంట్స్ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయుల నిష్క్రమణ పాఠశాలకు తీరని లోటు అంటున్నారు. ఇంతకు ముందు ఈ గ్రామానికి ఎందరో ఉపాధ్యాయులు వచ్చినా చదువుల స్థాయి మారలేదు. పల్లెల్లో విద్యా స్థాయి మారుతున్న తరుణంలో టీచర్ల బదిలీలు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయుడు రాంశరణ్ బగ్రీ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలకు మెరుగైన విద్య అందించడమే తన ధ్యేయమని, పాఠశాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే తన కల అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తున్నా.. విద్యార్థుల ఈ ప్రేమ తనను భావోద్వేగానికి గురి చేస్తుందన్నారు. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారి ఘనశ్యామ్ సోనీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పునరాలోచిస్తున్నట్లు తెలిపారు. వీలైతే, ఈ బదిలీ ఉత్తర్వులను నిలిపివేయవచ్చని, అయితే ఇది పరిపాలనా ప్రక్రియ అని ఆయన అన్నారు.

మరోవైపు, విద్యార్థుల ఉద్యమం ఐదో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఉపాధ్యాయుడు రాంశరణ్ బగ్రీ తన జీవితాన్ని చక్కదిద్దారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని కోల్పోవాలని కోరుకోనని అంటున్నాడు. ఈ కథలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉన్న అనుబంధం లోతును మాత్రమే కాకుండా, ఒక మంచి ఉపాధ్యాయుడు సమాజంపై ఎంత ప్రభావం చూపగలడో కూడా చూపిస్తుంది. రాంశరణ్ బగ్రీ వంటి ఉపాధ్యాయులు తమ శక్తినంతా పిల్లల జీవితాలను రూపొందించడంలో వెచ్చిస్తారు. వాస్తవానికి సమాజాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..