మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ యాదవ్ తొలి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి నిర్ణయంలో మతపరమైన అంశాలు ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా స్థలాల వద్ద లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది మోహన్ యాదవ్ సర్కార్. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి పలు కీలక మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధ్యక్షత సమావేశమైన తొలి కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మోహన్ యాదవ్ ఈ విషయాలను వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాల నిర్వహణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లోనూ అవే రూల్స్ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత ఈ మేరకు చర్యలు ఉంటాయని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. ఫుడ్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, స్థానిక పట్టణ సంస్థల అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 31 మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయంపై నిషేధం అమలవుతుందని సీఎం మోహన్ యాదవ్ వెల్లడించారు.
అలాగే, వచ్చే నెలలో అయోధ్య రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఇక తునికాకు సేకరించేవారికి శుభవార్త చెప్పారు సీఎం మోహన్ యాదవ్ సర్కార్. బస్తాకు రూ.4 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం అన్నారు. మరోవైపు.. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కాలేజ్ నిర్మిస్తామన్నారు. దానికి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 52 కాలేజీలు ఎంపిక చేసినట్లు తెలిపారు. డిగ్రీ మార్కుల మెమోల కోసం విద్యార్థులకు కాలేజీలు, యూనివర్శిటీల్లో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.
అంతకుముందు రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉజ్జయిని దక్షిణ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ 58 ఏళ్ల నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణం చేసిన తర్వాత బాబా మహాకళా దర్శనం కోసం ఉజ్జయిని చేరుకున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డాక్టర్ మోహన్ యాదవ్ తొలి నోట్‌షీట్‌ను రాసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా మొదటి ఆర్డర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు శివరాజ్ ప్రభుత్వంలో మోహన్ యాదవ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. హిందూ ఇతిహాసం ‘శ్రీ రామచరిత్మానస్’ని 2021లో కాలేజీల్లో ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా చేస్తానని ప్రకటించారు. మోహన్ యాదవ్ పూర్తి హిందుత్వ భావాలు కలిగిన వ్యక్తిగా భావిస్తుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…