Sunil Kanugolu: తెలంగాణలో ఫలించిన సునీల్‌ కానుగోలు వ్యూహాం.. మరో కీలక బాధ్యత అప్పగించిన కాంగ్రెస్!

|

Dec 22, 2023 | 2:12 PM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాలలో మార్మోగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు అనుసరించిన వ్యూహాలనే సునీల్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేశారు. కర్ణాటకలో ఐదు హామీలను ప్రచారం చేసి సక్సెస్‌ అయిన సునీల్ బృందం తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ప్రధానంగా ప్రచారం చేసింది.

Sunil Kanugolu: తెలంగాణలో ఫలించిన సునీల్‌ కానుగోలు వ్యూహాం.. మరో కీలక బాధ్యత అప్పగించిన కాంగ్రెస్!
Sunil Kanugolu
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫేస్‌ ఆఫ్‌ ద పార్టీగా కాంగ్రెస్‌ తరపున కనిపించింది రేవంతే అయినా కనపడకుండా చక్రం తిప్పిన వ్యక్తి మరొకరున్నారు. ఆయనే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలను అమలు చేయడంలో తన గురువు ప్రశాంత్ కిశోర్‌ను సునీల్‌ మించిపోయాడని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు పార్టీ ప్రచార వ్యూహాన్ని నిర్వహించడంతోపాటు సోషల్ మీడియా ప్రచారాలను చూసే బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాలలో మార్మోగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు అనుసరించిన వ్యూహాలనే సునీల్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేశారు. కర్ణాటకలో ఐదు హామీలను ప్రచారం చేసి సక్సెస్‌ అయిన సునీల్ బృందం తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ప్రధానంగా ప్రచారం చేసింది. ప్రతి సామాన్యుడికీ కాంగ్రెస్‌ గ్యారంటీలు అర్థమయ్యేలా వివరించడంలో సునీల్‌ టీమ్‌ సక్సెసయింది. ముఖ్యంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. కాంగ్రెస్‌ బలంగా ప్రచారం చేయడం సునీల్ వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు.

కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన కానుగోలు సామాజిక మాధ్యమాల్లో పార్టీ ప్రచార వ్యూహాన్ని చూసుకోవాలని కోరినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ప్రచార వ్యూహాన్ని చూసేందుకు కానుగోలు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ టాస్క్‌తో పాటు, హర్యానాలో పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా ఆయనకు అప్పగించారు.

ఇటీవల కానుగోలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, పార్టీ కమ్యూనికేషన్ టీమ్ సభ్యులు కూడా హాజరయ్యారు. రెండుసార్లు కాంగ్రెస్ వార్‌రూమ్‌ని సందర్శించిన ఆయన వేణుగోపాల్, కమ్యూనికేషన్ ఇన్‌చార్జి జైరాం రమేష్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాతేతో సమావేశమయ్యారు.

కాంగ్రెస్ శిబిరానికి రాకముందు, కానుగోలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతో ప్రచారం చేసేందుకు పరిశీలించడానికి అనేక రౌండ్ల సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే కానుగోలు కాంగ్రెస్‌లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది మేలో కానుగోలును కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు. అప్పటి నుండి పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. తెలంగాణలో సర్వేలు, ప్రచారం, అభ్యర్థులను నిర్ణయించడం, గెలుపు వ్యూహాన్ని సిద్ధం చేయడంలో సునిల్ కీలక పాత్ర పోషించారు.

మార్పు కావాలి- కాంగ్రెస్‌ రావాలి అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది సునీల్‌ బృందమే. రాహుల్‌, ప్రియాంకలతో కూడా సభల్లో తెలుగులో చెప్పించి అందరి దృష్టినీ ఆకర్షించేలా చేశారు. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ రావాలనే నినాదం కూడా హైలైట్‌ చేశారు. ఎన్నికల వేళ ఏ యాడ్‌ ఏ రోజు రావాలనేది నిర్ణయించడంతో పాటు ఓ పద్ధతి ప్రకారం ప్రకటనలు వచ్చేలా చేసింది సునీల్‌ బృందమే. ఆకర్షణీయంగా టీవీ, పేపర్‌ ప్రకటనలు వచ్చేలా చూశారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏ అంశం హైలైట్‌ చేయాలో టీమ్‌కు దిశానిర్దేశం చేశారు. ఇదే కాకుండా నేతల రాకపోకల ప్లాన్‌లు, సభలు, ప్రస్తావించాల్సిన అంశాలనూ, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అంశాలను సునీల్‌ టీమే డిసైడ్‌ చేసింది

గతంలో బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసిన కానుగోలు, 2014లో పార్టీని వీడే ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేశారు. అతను ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకువచ్చేందుకు పనిచేశాడు. 2017లో యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన విజయంలో కీలక పాత్ర పోషించారు. దాని తర్వాత మారిన పరిణామాలతో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు మద్దతు ఇవ్వడానికి కానుగోలు బాధ్యత వహించాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం లోక్ సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…