Union Minister: బాధ్యతలు చేపట్టిన తెలుగు కేంద్ర మంత్రులు.. తొలి సంతకం దేనికంటే..?

ఢిల్లీలో తెలుగు కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారం అట్టహాసంగా జరిగింది. మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ప్రత్యేక పూజలు చేసి చార్జ్ తీసుకున్నారు. కేబినెట్ మంత్రుల బాధ్యతల స్వీకరణలో కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనగా, సహాయ మంత్రుల బాధ్యతల స్వీకరణ నిరాడంబరంగా జరిగింది.

Union Minister: బాధ్యతలు చేపట్టిన తెలుగు కేంద్ర మంత్రులు.. తొలి సంతకం దేనికంటే..?
Union Ministers Take Charge

Updated on: Jun 13, 2024 | 6:18 PM

ఢిల్లీలో తెలుగు కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారం అట్టహాసంగా జరిగింది. మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ప్రత్యేక పూజలు చేసి చార్జ్ తీసుకున్నారు. కేబినెట్ మంత్రుల బాధ్యతల స్వీకరణలో కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనగా, సహాయ మంత్రుల బాధ్యతల స్వీకరణ నిరాడంబరంగా జరిగింది.

ఢిల్లీ శాస్త్రి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా జి. కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్‌లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డితోపాటు బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రిగా సతీష్ చంద్ర దూబే కూడా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారానికి ముందు.. తెలంగాణ భవన్‌లో కుటుంబ సమేతంగా ఆలయాల్లో పూజలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తర్వాత.. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. బాధ్యత చేసిన తర్వాత.. గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు కిషన్ రెడ్డి.

ప్రధాని తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పదేళ్లలో ఎక్కడా బొగ్గు కొరత, కరెంట్ సమస్య లేకుండా ప్రధాని చేశారన్నారు. విదేశీ బొగ్గుపై ఆధారపడకుండా దేశంలోనే బొగ్గు ఉత్పత్తి పెంచి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంలో దేశాభివృద్ధికి కృషి చేస్తామన్నారు కిషన్ రెడ్డి.

ఇక విజన్‌ 2047 ప్రణాళికతో పౌరవిమానయాన శాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే యంగెస్ట్ కేంద్రమంత్రిగా రికార్డులకెక్కిన రామ్మోహన్ నాయుడు.. తనను గెలిపించి ఈస్థాయికి తీసుకొచ్చిన శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. విజన్‌ ఉన్న మోదీ, చంద్రబాబుల మార్గదర్శకత్వం తనకు అదనపు బలమన్నారు రామ్మోహన్ నాయుడు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు బండి సంజయ్. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్. ఇక కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా తన చాంబర్‌లో నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. తనకు కేటాయించిన శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు పెమ్మసాని.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..