కేరళ శాసనసభలో నిర్వహించిన ఫ్లోర్ టెస్ట్ లో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం నెగ్గింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (విపక్షం) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 87 మంది, అనుకూలంగా 40 మంది సభ్యులు ఓటు చేశారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు సుదీర్ఘంగా సభా కార్యకలాపాలు కొనసాగాయి. తన ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ చర్యలపై ముఖ్యమంత్రి విజయన్ దాదాపు మూడు గంటల నలభై నిముషాలసేపు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా …ప్రతిపక్ష సభ్యులు అవినీతి వ్యతిరేక నినాదాలు చేస్తూ.. సభ నుంచి నిష్క్రమించారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందని విపక్షనేత రమేష్ చెన్నితాల, ఇతర సభ్యులు ఆరోపించగా.. విజయన్ దీటైన సమాధానమిచ్చారు. పాలక పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం, సమాచారం ఇస్తున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ కేసులో నిందితులనెవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్ సభ్యులు అనేక సందర్భాల్లో బీజేపీ టీమ్ ‘బీ’ గా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీ నుంచి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారని ఎద్దే వా చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందన్నారు.