Kerala Blast Updates: కేరళలోని కొచ్చి నగరాన్ని వరుస పేలుళ్లు వణికించాయి. ఎర్నాకుళం కాలామసేరిలో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. యెవోహా ప్రార్థనా మందిరంలో 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఉదయం 9.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో గాయపడ్డ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
సంఘటనా స్థలానికి అధికార యంత్రాంగం, బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ బ్లాస్ట్ ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. పాలస్తీనా యుద్దం కారణంగా కేరళలో పలుచోట్లు ముస్లిం సంస్థలు నిరసనలు చేపట్టాయి. ఇదే సమయంలో క్రిస్టియన్ ప్రార్థనా స్థలంలో పేలుడు జరగడం సంచలనం రేపింది.
ఆదివారం కావడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని.. పేలుడు సంభవించడంతో అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. గాయపడ్డవారికి వైద్య సహాయం అందుతుందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాద కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..