కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. కల్లార్‌కోట్‌లోని చంగనస్సేరిముక్ సమీపంలో అలప్పుజా జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బస్సును ఢీకొట్టిందని.. అక్కడికక్కడే ముగ్గురు చనిపోయనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. కేరళలోని అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలప్పుజ గవర్నమెంట్ టీడీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గురువాయుర్ నుంచి కాయంకుళానికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కేఎస్‌ఆర్టీసీ ( KSRTC) బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోగా.. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
వేగంగా వస్తున్న కారు బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కారు నుజ్జునుజ్జు అయిందని.. చాలా సేపటి తర్వాత క్షతగాత్రులను బయటకు తీసినట్లు తెలిపారు. మృతుల్లో ఆయుష్ షాజీ (19), శ్రీదీప్ వత్సన్ (19), బి. దేవానందన్ (19), మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ (19). మహమ్మద్ ఇబ్రహీం(19) మరొకరు ఉన్నారు. విద్యార్థుల మృతి వార్త తెలుసుకున్న కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..
నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులంతా అలప్పుజలో సినిమా చూడటానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కారు అదుపు తప్పి వాయిటిల నుంచి కాయంకుళం వెళ్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రమాద ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..