ఆలయంలో అన్నదానానికి యాచకురాలు ఏకంగా లక్ష రూపాయలు విరాళంగా అందిస్తోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లోని సిద్ధాపురకు చెందిన అశ్వత్థమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆలయాల ప్రవేశద్వారం దగ్గర యాచిస్తూ జీవనం సాగించేవారు. ఈ విధంగా భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తన అవసరాలు తీర్చుకుని, మిగిలిన సొమ్మును పలు ఆలయాల్లో అన్నదానానికి విరాళంగా ఇస్తూ ఉండేవారు. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు రూ.9 లక్షల వరకు విరాళంగా అందించింది. ఈ క్రమంలో మంగళూరు, ముల్కిలోనున్న బప్పనాడు శ్రీదుర్గా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదానానికి తాజాగా లక్ష రూపాయలను విరాళమిచ్చారు. యాచకురాలైన అశ్వత్థమ్మ అన్నదానం కోసం నగదు ఇవ్వడంతో ఆలయ ట్రస్టు ప్రతినిధులు ఆమెను సత్కరించారు.
కాగా అశ్వత్థమ్మ భర్త, పిల్లలు 18 ఏళ్ల కిందట మరణించారు. వృద్ధురాలైన తనను చూసే దిక్కులేకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో పలు ఆలయాల్లో యాచిస్తూ పొట్టపోసుకుంటూ ఉండేది. తన ఖర్చులకు పోనూ మిగిలిన సొమ్మును బ్యాంకులో పొదుపు చూసేది. ఇలా పొదుపు చేయగా కూడబెట్టిన సొమ్మును ఆలయాలకు ఆన్నదానం చేసేందుకు ఇచ్చేవారు. ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో భిక్షాటన ద్వారా సేకరించిన సొమ్మును తిరిగి సమాజ సేవకు అందిస్తున్నట్లు అశ్వతమ్మ తెలిపారు. అయ్యప్ప భక్తురాలైన అశ్వత్థమ్మ, గతంలో మాల వేసుకుని శబరిమల వెళ్లి అక్కడ కూడా అన్నదానానికి రూ.1.5 లక్షలు ఇచ్చారు. కర్ణాటకలోని పలు దేవాలయాల్లో అన్నదానాలకు డబ్బు విరాళంగా అందించారు. దక్షిణ కర్ణాటక, ఉడిపి జిల్లాలలోని పలె అనాథ శరణాలయాలకు కూడా ఉదారంగా విరాళాలు ఇచ్చారు.