
దీపావళి అంటే దీపాల కాంతులే కాదు.. బాణాసంచా వెలుగులు కూడా! అయితే ఈసారి దీపావళికి బాణాసంచా వెలుగులు, మోతలు కనిపించవు.. వినిపించవు.. కారణం బాణాసంచాపై పలు రాష్ట్రాలు నిషేధం విధించడమే.. తాజాగా కర్నాటక కూడా బాణాసంచాను నిషేధించాలనే నిర్ణయం తీసుకుంది.. బాణాసంచా కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఎక్కువవుతుందని, ఇది ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఇలాంటి సమయంలో బాణాసంచా కాల్చడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.. కరోనా విజృంభిస్తున్న వేళ బాణాసంచా కాల్చడం తగదని కేజ్రీవాల్ అన్నారు.. ఈ నెల ఏడు నుంచి 30 వరకు బాణాసంచాపై నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.. ఢిల్లీనే కాదు ఒడిశా, రాజస్తాన్ ప్రభుత్వాలు కూడా బాణాసంచాపై నిషేధం ప్రకటించాయి. హర్యానా ప్రభుత్వం కూడా బాణాసంచాపై పాక్షికంగా నిషేధం విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించలేదు కానీ బాణాసంచాకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.. ఇంటిపట్టునే ఉంటూ దీపాలు వెలిగించాలని అభ్యర్థించింది. ఇదిలా ఉంటే బాణాసంచా కాల్చడంపై విధించిన నిషేధాన్ని తొలగించాలని విన్నవించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. ఎందుకంటే బాణాసంచా ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది తమిళనాడులోనే! బాణాసంచా పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా మరో నాలుగు లక్షల మందికి జీవనోపాధి కలుగుతున్నదని పళనిస్వామి అన్నారు. నిషేధం కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.