కరోనాపై సమరం.. భారత్-పాక్ ఉమ్మడి పోరాటం

| Edited By: Pardhasaradhi Peri

Mar 14, 2020 | 2:30 PM

భయంకర కరోనాను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాటం జరపాలని ప్రధాని మోదీ 'సార్క్'సభ్యదేశాలకు  పిలుపునిచ్చారు. ఇందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ అంగీకారం తెలిపింది.

కరోనాపై సమరం.. భారత్-పాక్ ఉమ్మడి పోరాటం
Follow us on

భయంకర కరోనాను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాటం జరపాలని ప్రధాని మోదీ ‘సార్క్’సభ్యదేశాలకు  పిలుపునిచ్చారు. ఇందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ అంగీకారం తెలిపింది. కరోనాపై సమరానికి ప్రపంచ, ప్రాంతీయ స్థాయుల్లో సమన్వయ కృషి అవసరమని పేర్కొంది. కోవిడ్-19 ని ఎదుర్కొనడానికి తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారని, ఇందులో పాల్గొనవలసిందిగా తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన  స్పెషల్ అసిస్టెంట్ (హెల్త్) ని నియమించారని ఆ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు. ఈ విషయంలో తమ పొరుగుదేశాలకు సహాయ పడేందుకు పాకిస్తాన్ సిధ్ధంగా ఉందన్నారు. కరోనా ఔట్ బ్రేక్ ని నివారించడానికి జాతీయ భద్రతా వ్యవహారాలపై గల కమిటీతో ఇమ్రాన్ ఖాన్ అత్యవసరంగా సమావేశమయ్యారనికూడా ఆయన తెలిపారు.

సార్క్ లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, నేపాల్, మాల్దీవులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాల్లో 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 1.3 లక్షల మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలిసిందని మోదీ ట్వీట్ చేశారు. దీని నివారణకు తాము జరిపే కృషికి చేయూతనందించవలసిందిగా సభ్య దేశాలను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చిద్దామని ఆయన అన్నారు. మన ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇందుకు భూటాన్, శ్రీలంక వెంటనే సానుకూలంగా స్పందించాయి. సార్క్ సభ్యదేశాల్లో మొత్తం 126 కరోనా కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్ లో 20 కేసులు నమోదైనట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ప్రమాదకరంగా వ్యాపిస్తోందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చరించింది.