రాంచీ, ఆగస్టు 18: మేత కోసం వెళ్లిన ఓ ఆవు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దానిని కాపాడేందుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు విచిత్ర రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో చోటుచేసుకుంది.
జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని పిస్కా అనే గ్రామంలో గురువారం (ఆగస్టు 17) మధ్యాహ్నం ఓ ఆవు బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు దానిని కాపాడేందుకు ప్రయత్నించారు. దానిని రక్షించేందుకు 9 మంది వ్యక్తులు తాళ్ల సాయంతో బావిలోకి దిగారు. మరి కొంత మంది బావిపై నిలబడి తాళ్లతో వారికి సాయం చేస్తున్నారు. ఇంతలో వాళ్లు నిలబడిన బావి గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో బావిలోకి దిగిన వారు లోపలికి కూరుకుపోయారు. బావిపై నిలబడిన వ్యక్తులు కూడా బావిలో పడిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఐదుగురి మృత దేహాలను బయటికి తీశారు. ఇంకొంత మంది బావిలో కూరుకుపోయినట్లు సమాచారం. వారి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు.
सिल्ली के मुरी क्षेत्र स्थित पिस्का गांव में कुंए में 5 लोगों की मरने की दुःखद खबर से मन व्यथित है।
परमात्मा दिवगंत आत्माओं को शांति प्रदान कर शोकाकुल परिवारजनों को दुःख की यह विकट घड़ी सहन करने की शक्ति दे।— Hemant Soren (@HemantSorenJMM) August 17, 2023
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘బావి కూలి ఐదుగురు మృతి చెందారు. దేవుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని సీఎం సోరెన్ తన ట్విటర్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు. బావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని రాంచీ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెచ్‌బి జామా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.